ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
- కలెక్టర్ స్నేహ శబరీష్
విశ్వంభర , మహబూబాబాద్: జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.అనిల్ కుమార్, తో కలిసి కలెక్టర్ ప్రజావాణి నిర్వహించి ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉంటే సత్వరమే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత విభాగాలకు సిఫారసు చేసి సమస్య పరిష్కారం చేయుటకు కృషి చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలు, విద్యాసంస్థలలో మండల ప్రత్యేక అధికారులు ప్రతి 15, రోజులు లేదా మాసంలో మూడు దఫాలుగా వారికి కేటాయించిన హాస్టల్లో తనిఖీ చేసి విద్యార్థులతో స్వయంగా మాట్లాడి అందుతున్న మౌలిక వసతులు విద్యా బోధనల గురించి వివరాలు అడిగి తెలుసుకొని తనకు నివేదిక సమర్పించాలని సూచించారు. ప్రతి విద్యా సంస్థలలో పిల్లలకు హెల్త్ ఎడ్యుకేషన్ న్యూట్రిషన్ సానిటేషన్ లపై ఎలాంటి జాప్యం లేకుండా సౌకర్యాలు కల్పించాలని, షెడ్యూలు ప్రకారం విద్యార్థిని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి మానసిక ఆరోగ్య స్థితిగతులను గమనిస్తూ ఉండాలని తెలిపారు, పదవ తరగతి పరీక్షలు వస్తున్న నేపథ్యంలో టైం టేబుల్ ప్రకారం ప్రత్యేక తరగతులు నిర్వహించి జిల్లాలో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని, పరీక్షా కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు ఉండే విధంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో మహబూబాబాద్ రెవిన్యూ డివిజనల్ అధికారి క్రిష్ణవేణి, డి ఆర్ డి ఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, జెడ్పి సీఈవో పురుషోత్తం, డివిహెచ్ఓ డాక్టర్ కిరణ్ కుమార్, డిపిఓ హరిప్రసాద్, ఎక్సైజ్ ఎస్పి కిరణ్ కుమార్, ఉద్యాన శాఖ అధికారి మరియన్న, ఎస్సీ, బీసీ, మైనారిటీ సంక్షేమ అధికారులు శ్రీనివాసరావు, శ్రీనివాస్,అన్ని విభాగాల జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



