ఫీజు బకాయిలు విడుదల చేయాలని బీసీ సంఘాల ఫీజు పోరు దీక్ష

ఫీజు బకాయిలు విడుదల చేయాలని బీసీ సంఘాల ఫీజు పోరు దీక్ష

విశ్వంభర, హైదరాబాద్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదు ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో బీసీ సంఘాలు ఫీజు పోరు దీక్ష నిర్వహించాయి. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేష్ యాదవ్ అధ్యక్షతన, జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్ సమన్వయంతో ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే పూర్తి ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తామని, బకాయిలన్నీ విడుదల చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాలేదని విమర్శించారు. రెండు సంవత్సరాలు గడిచినా ఫీజులు విడుదల చేయకపోవడం వల్ల పేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని, లేకపోతే విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి దిగుతారని హెచ్చరించారు.హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఎన్నికల హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎల్. రమణ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదల చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమానికి సీపీఐ నాయకుడు జి. నరసింహ, టీజేఎస్ ఉపాధ్యక్షుడు నిజ్జన రమేనన, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ, సినీ దర్శకుడు ఎన్. శంకర్, బీసీ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గుజ్జ కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్ చారి, ఎర్ర సత్యనారాయణ, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, శ్యాం కుర్మా, మణి మంజరి, జాజుల లింగం గౌడ్, రావులకోల్ నరేష్, ప్రజావతి, దిటి మల్లయ్య, దేశగోని సంబశివ గౌడ్ తదితరులు హాజరయ్యారు.

Tags: