గులాబీ బాస్‌తో హరీశ్ రావు భేటీ

గులాబీ బాస్‌తో హరీశ్ రావు భేటీ

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మంగళవారం దాదాపు 7 గంటల పాటు సిట్ (SIT) విచారణను ఎదుర్కొన్న మరుసటి రోజే, ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పార్టీ అధినేత కేసీఆర్ తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు క్లైమాక్స్ దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మంగళవారం దాదాపు 7 గంటల పాటు సిట్ (SIT) విచారణను ఎదుర్కొన్న మరుసటి రోజే, ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పార్టీ అధినేత కేసీఆర్ తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో విచారణాధికారులు సంధించిన ప్రశ్నలు, తాను ఇచ్చిన సమాధానాలపై హరీశ్ రావు 'గులాబీ బాస్'కు వివరించినట్లు సమాచారం.

విచారణలో అసలేం జరిగింది?
మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన విచారణలో సిట్ అధికారులు హరీశ్ రావును ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ అధికారులతో ఉన్న సంబంధాలు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఆయనకు తెలిసిన అంశాలపై ఆరా తీశారు. అయితే, ఇప్పటికే అరెస్టయిన అధికారులు 'పెద్దాయన' ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందని వాంగ్మూలం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుండటంతో, ఆ పెద్దాయన ఎవరనే కోణంలోనే విచారణ సాగినట్లు తెలుస్తోంది.

Read More సైబర్ నేరాలపై అవగాహన సదస్సు 

కాళేశ్వరం సీన్ మళ్ళీ?
ప్రస్తుత పరిణామాలు గతంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణను గుర్తుచేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్పుడు కాళేశ్వరం కేసులో హరీశ్ రావును విచారించిన వెంటనే ఆయన కేసీఆర్‌ను కలిశారు. ఆ భేటీ ముగిసిన కొద్ది రోజులకే కమిషన్ కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ విచారణ ముగియడం, తక్షణమే ఎర్రవల్లిలో భేటీ జరగడం చూస్తుంటే.. తదుపరి నోటీసులు నేరుగా కేసీఆర్‌కే అందుతాయా? అనే చర్చ జోరందుకుంది.

సిట్' నెక్స్ట్ టార్గెట్ ఎవరు?
దర్యాప్తు సంస్థలు సేకరించిన సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాల ప్రకారం విచారణ ప్రక్రియ ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే మాజీ ఎస్‌ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు వంటి వారు నిందితులుగా ఉండగా, రాజకీయంగా ఈ కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది. కాగా, ప్రభుత్వ చర్యలను 'రాజకీయ కక్ష సాధింపు'గా అభివర్ణిస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు, దీన్ని న్యాయపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి.

వరుస విచారణలు, నోటీసుల నేపథ్యంలో పార్టీ కేడర్ ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఉండేందుకు, అలాగే చట్టపరమైన చిక్కుల నుంచి ఎలా బయటపడాలనే అంశంపై హరీశ్ రావుకు కేసీఆర్ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది.