ద్విచక్ర వాహనాలు ఢీకొని యువకుడి మృతి
విశ్వంభర, గౌతంనగర్: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మల్కాజిగిరి ఠాణా పరిధిలో మంగళవారం జరిగింది. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. రాంనగర్‌కు చెందిన దేశ్‌పాక్ శ్రేయాంత్(23) ఈసీఐఎల్ హ్యూందాయ్ షోరూంలో స్టోర్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేస్తున్నారు. విధులు ముగించుకుని అర్థరాత్రి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నాడు. అదే సమయంలో దమ్మాయిగూడకు చెందిన రుషికేష్ హలీం తినేందుకు మౌలాలి కమాన్ వైపునకు వస్తున్నాడు. ఎదురుగా వస్తున్న శ్రేయాంత్.. రుషికేష్ వాహనాన్ని ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనానికి మంటలు అంటుకొని కాలిపోయింది. తీవ్రంగా గాయపడిన శ్రేయాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. రుషికేష్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు మంటలను అదుపు చేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.



