వికసిత్ భారత్ దిశగా వేగంగా అడుగులు
పార్లమెంట్ 2026-27 బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి, మూడోసారి ఎన్డీయే అధికారంలోకి వచ్చాక తీసుకున్న సంచలన నిర్ణయాలు, పదేళ్ల పాలనలో సాధించిన ప్రగతిని వివరించారు.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: పార్లమెంట్ 2026-27 బడ్జెట్ సమావేశాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి, మూడోసారి ఎన్డీయే అధికారంలోకి వచ్చాక తీసుకున్న సంచలన నిర్ణయాలు, పదేళ్ల పాలనలో సాధించిన ప్రగతిని వివరించారు. దేశం ప్రస్తుతం సంస్కరణల పథంలో దూసుకుపోతోందని ఆమె ఉద్ఘాటించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. గత 10-11 ఏళ్లలో భారత్ ప్రతి రంగంలోనూ తన పునాదులను పటిష్టం చేసుకుందని, 2026 సంవత్సరం 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారత్) దిశగా సాగే ప్రయాణంలో ఒక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు.
మహిళల ఆధారిత అభివృద్ధి దిశగా
గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దేశంలో ప్రతి పౌరుడికి జీవిత బీమా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశవ్యాప్తంగా 4 కోట్ల పక్కా ఇళ్లు నిర్మించామని.. 10 కోట్ల మందికి ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చామని తెలిపారు. 1.80 లక్షల ఆయుష్మాన్ భారత్ కేంద్రాల ద్వారా కోట్లాది మందికి ఉచిత వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. మహిళల ఆధారిత అభివృద్ధి దిశగా భారత్ ముందుకెళ్తోందని రాష్ట్రపతి చెప్పారు. నేడు రెండు కోట్ల మందికి పైగా మహిళలు లక్ పతి దీదీలుగా ఎదిగారని చెప్పారు. ఈ దశాబ్దం ముగిసే నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని భారత్ ఖచ్చితంగా సాధిస్తుందని రాష్ట్రపతి ధీమా వ్యక్తం చేశారు. గత 11 ఏళ్లలో ఈశాన్య ప్రాంతంలో 7,200 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులను నిర్మించామని తెలిపారు. దీనివల్ల మారుమూల కొండ ప్రాంతాలు, గిరిజన, సరిహద్దు ప్రాంతాలకు రవాణా సౌకర్యం సులభతరమైందని పేర్కొన్నారు.
రైతు సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం
రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముర్ము తెలిపారు. వ్యవసాయ కూలీల సంక్షేమం కోసం తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా 125 రోజులు పనిదినాలు కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. అవినీతిని అరికట్టడంతో పాటు, నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడం ఈ చట్టం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ పథకం గ్రామీణాభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని, రైతులకు, పశుపోషకులకు, మత్స్యకారులకు కొత్త వసతులను కల్పిస్తుందని ఆమె చెప్పారు. ప్రస్తుతం 150 మిలియన్ టన్నుల ధాన్యం ఉత్పత్తితో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని కితాబిచ్చారు. ఏయే పంటల ఉత్పత్తిలో అయితే వ్యవసాయ రంగం వెనుకబడి ఉందో, వాటి ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆమె చెప్పారు. ముఖ్యంగా తినే నూనెలు, నూనె గింజలు, పప్పు ధాన్యాలపై చేపట్టిన 'జాతీయ మిషన్ల' ద్వారా దిగుమతులను తగ్గించి, భారత్‌ను స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్లడమే ప్రభుత్వ ఉద్దేశమని ఆమె స్పష్టం చేశారు.
ఆత్మనిర్భర్ భారత్ & రక్షణ రంగం
మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా పథకాలు దేశ గమనాన్ని మార్చేశాయని రాష్ట్రపతి కొనియాడారు. ఉత్పత్తి రంగంలో తీసుకొచ్చిన కీలక సంస్కరణలతో దేశం నుంచి ఎగుమతులు భారీగా పెరిగాయని తెలిపారు. మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో భారత్ నేడు ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరిందని స్పష్టం చేశారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో ఆదాయపన్ను శాఖలో కీలక సంస్కరణలు తీసుకొచ్చామని రాష్ట్రపతి ముర్ము వివరించారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం మంచి ఫలితాలను అందుకుంటుందని తెలిపారు. డిజిటల్ ఇండియాను ప్రోత్సహిస్తూ కొత్త అవకాశాలను కల్పిస్తోందని రాష్ట్రపతి తెలిపారు. గతేడాది భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సింధూర్' మన సత్తాను ప్రపంచానికి చాటిందని, భారత్‌పై దాడి చేస్తే ఫలితం ఎలా ఉంటుందో నిరూపితమైందని ఆమె పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ తర్వాత రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయికి చేరాయని వెల్లడించారు.



