సత్వర న్యాయం జరగాలి
విశ్వంభర, ముషీరాబాద్: తెలంగాణలో బీసీ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ప్రకారం, అసెంబ్లీలో బీసీ అత్యాచార నిరోధక చట్టం వెంటనే ప్రవేశపెట్టాలంటూ డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాదు ఇందిరా పార్క్ వద్ద బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ నేతృత్వంలో బీసీ సంఘాల మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ , పలువురు నాయకులు పాల్గొన్నారు. నేతలు తెలంగాణ పోలీస్ దేశంలో నెంబర్ వన్ అయినా, రెడ్డి, రావుల ఆధిపత్యంలో దోషులపై సరైన చర్యలు తీసుకోలేకపోతున్నారని విమర్శించారు. కుమ్మెర గ్రామంలో జరిగిన సంఘటనకు ప్రియాంక రెడ్డి కేసు తరహాలో సత్వర న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. బీసీ నేతలు తక్షణమే అసెంబ్లీలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ తరహా చట్టాన్ని బీసీ కోసం తీసుకురావాలని, లేనిపక్షంలో బీసీల రాజ్యాధికార శకం ప్రారంభ మవుతుందని హెచ్చరించారు. విజెఆర్ నారగోని, ప్రొ. మురళి మనోహర్, వి. జానయ్య, ఎస్. హరి శంకర్, గుజ్జ కృష్ణ, బర్కా కృష్ణ, వేముల రామకృష్ణ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.



