అస్సాం ప్రగతి పథంలో మరో మైలురాయి
రూ.6,950 కోట్లతో కజిరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభం
పర్యావరణ పరిరక్షణ, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా అస్సాంలో భారీ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. నాగావ్ జిల్లాలోని కలియాబోర్ వేదికగా సుమారు రూ.6,950 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కజిరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ నేడు శంకుస్థాపన చేశారు.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: పర్యావరణ పరిరక్షణ, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా అస్సాంలో భారీ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. నాగావ్ జిల్లాలోని కలియాబోర్ వేదికగా సుమారు రూ.6,950 కోట్ల వ్యయంతో నిర్మించనున్న కజిరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ నేడు శంకుస్థాపన చేశారు. ఈ జాతీయ రహదారి ప్రాజెక్టు మొత్తం పొడవు 86 కిలోమీటర్లు ఉండనుంది. ఇందులో 35 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ వైల్డ్‌లైఫ్ కారిడార్ ఉంటుంది. ఇది కజిరంగా నేషనల్ పార్క్ మీదుగా సాగుతుంది. ఈ ప్రాజెక్టు నాగావ్, కర్బీ ఆంగ్లాంగ్, గోలాఘాట్ జిల్లాల గుండా వెళుతూ.. ఎగువ అస్సాంలోని డిబ్రూగఢ్, తిన్సుకియా ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎలివేటెడ్ కారిడార్ వల్ల వన్యప్రాణుల సంచారానికి ఆటంకం కలగదు, తద్వారా మానవ-వన్యప్రాణి సంఘర్షణలు తగ్గుతాయి.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కజిరంగా కేవలం ఒక నేషనల్ పార్క్ మాత్రమే కాదని, అది అస్సాం ఆత్మ అని కొనియాడారు. యునెస్కో గుర్తించిన ఈ ప్రపంచ వారసత్వ సంపదను కాపాడటం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. గడిచిన పదేళ్లలో దేశంలో అటవీ విస్తీర్ణం పెరిగిందన్నారు. 'ఏక్ పేడ్ మా కే నామ్' ప్రచారం కింద ఇప్పటివరకు రూ.260 కోట్ల మొక్కలు నాటారని ఆయన తెలిపారు. ప్రకృతి, అభివృద్ధి కలిసి సాగగలవని భారత్ ప్రపంచానికి చాటిచెబుతోందని అన్నారు. అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం అక్రమ చొరబాటును అడ్డుకోవడంలో, అడవులను, సాంస్కృతిక ప్రదేశాలను ఆక్రమణల నుండి విడిపించడంలో చేస్తున్న కృషిని ప్రధాని అభినందించారు. దేశ ప్రజలందరికీ బీజేపీ మొదటి ప్రాధాన్యతగా మారిందని, ఇటీవలి బీహార్ ఎన్నికలు, మహారాష్ట్రలోని BMC ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని ప్రధాని మోదీ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో అస్సాం అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు.
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని రెండు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. కామాఖ్య - రోహ్‌తక్ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్, డిబ్రూగఢ్ - లక్నో (గోమ్తీ నగర్) అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. పర్యావరణాన్ని కాపాడుకుంటూనే మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా అస్సాం భవిష్యత్ తరాలకు గొప్ప అవకాశాలను కల్పిస్తామని ప్రధాని భరోసా ఇచ్చారు.



