ఓవర్ లోడ్ సమస్య పరిష్కరించాలి 

ఓవర్ లోడ్ సమస్య పరిష్కరించాలి 

విశ్వంభర, గుండాల :  గుండాల  మండలంలో కరెంటు ఓవర్ లోడ్ సమస్యను పరిష్కరించి,కోతలు లేని నాణ్యమైన కరెంటు ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మద్దెపురం రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం గుండాల మండల కేంద్రంలో పత్రికా ప్రకటన విడుదల చేసి విలేకరులతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోత్కూర్ మండలం బుజిలాపురం 132/11కెవి సబ్ స్టేషన్ ఉప కేంద్రం నుండి గుండాల మండలానికి విద్యుత్ సరఫరాలో ఓవర్ లోడ్,సాంకేతిక కారణాల వల్ల గత వారం రోజులుగా గంటల తరబడిగా కరెంటు సక్రమంగా రావడం లేదని తెలిపారు.విద్యుత్ శాఖ సిబ్బంది వినియోగదారులకు జవాబుదారీగా పని చేయాలని కోరారు.గుండాల మండలంలో సుమారు ఎనిమిది వేల మంది రైతులు పదమూడు వేల ఎకరాల్లో వరి సాగు చేశారని వివరించారు.ఒక పక్క భూగర్భ జలాలు అడుగంటి మరోపక్క కరెంటు సమస్యల వల్ల చిరు పొట్ట దశలో ఉన్న యాసంగి వరి పంట పొలాలు ఎండి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కాబట్టి మోత్కూర్ మండలం బుజిలాపురం విద్యుత్ ఉప కేంద్రం నుండి గుండాల మండలానికి వచ్చే లైనులో ఉన్న దీర్ఘకాలిక లోపాలు సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ శాఖ జిల్లా ఉన్నతాధికారులను కోరారు.అప్రకటిత కరెంటు కోతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తే చేసే విధంగా ఉన్నాయని అన్నారు.లోపాలు లేని నాణ్యమైన కోతలు లేని కరెంటు ఇవ్వకపోతే మండల వ్యాప్తంగా అన్ని సబ్ స్టేషన్ల ముందు రైతులతో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Tags: