బీసీ నేతకే పీసీసీ పీఠం...! రేసులో మహేష్ కుమార్ గౌడ్ ?

బీసీ నేతకే పీసీసీ పీఠం...! రేసులో మహేష్ కుమార్ గౌడ్  ?

  • టీపీసీసీ ప్రెసిడెంట్ పదవిపై పార్టీ హైకమాండ్ ఫోకస్
  • బీసీ సామాజికవర్గానికి దక్కనున్న పదవి
  • రేసులో మహేష్ కుమార్ గౌడ్,  మధు యాష్కీ

విశ్వంభర,హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ చీఫ్ పదవిపై ఆ పార్టీ అధినాయకత్వం కసరత్తు దాదాపు పూర్తి కావొచ్చినట్లు తెలిసింది. ఢిల్లీలో పార్టీ నాయకత్వం రాష్ట్ర నేతలతో వరుస చర్చలు చేసింది. సీఎం రేవంత్ తో పాటుగా భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీతో జరిపారు. రాత్రి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. ఇక పీసీసీ రేసులో బలరాం నాయక్‌, అడ్లూరి లక్ష్మణ్‌తో పాటు మహేశ్‌కుమార్‌గౌడ్‌, మధుయాష్కీ ఉన్నారు. ఈసారి బీసీ నేతనే ఈ పదవి వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇందుకోసం ఇద్దరు ముఖ్య నేతలు పోటీ పడుతున్నారు వీరిలో మహేశ్‌కుమార్‌గౌడ్‌, మధుయాష్కీ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఏ క్షణమైనా కొత్త పీసీసీ చీఫ్ నియమాకానికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉందని హస్తం వర్గాలు చెబుతున్నాయి.

టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్  ? 

Read More యువ విద్యార్థుల్లో వ్యవస్థాపక ప్రోత్సాహమే బీవీఆర్ సైంట్ లక్ష్యం:బీవీఆర్ సైంట్ సీఈవో డా. సుధాకర్ పొటుకుచ్చి 

తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా సీనియర్ నేత బొమ్మ మహేష్ కుమార్ గౌడ్  పేరు దాదాపు ఖరారయ్యిందని తెలుస్తుంది  . ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే శనివారం సాయంత్రంలోపు ప్రకటన ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఏఐసీసీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. సుమారు గంటకుపైగా జరిగిన ఈ సమావేశంలో పీసీసీపై ఫుల్ క్లారిటీ వచ్చేసిందని తెలుస్తుంది . ఈ సమావేశంలో మహేష్ పేరు ఖరారు అయినట్లు సమాచారం. ఢిల్లీ నుంచే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఇదే మీటింగ్‌లో మంత్రివర్గ విస్తరణపై కూడా ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలిసింది. ఆరు పదవులు ఖాళీగా ఉండటంతో ప్రస్తుతం నలుగురితో మంత్రివర్గ విస్తరణకు పార్టీ నాయకత్వం ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం.


ఎవరీ మహేష్ కుమార్ గౌడ్ ?

బొమ్మ మహేష్ కుమార్.. గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత. 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లా, భీంగల్ మండలం, రహత్‌నగర్‌లో జన్మించారు. గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన.. విద్యార్థి దశలో ఎన్‌ఎస్‌యూఐ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా, జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పని చేశారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్‌పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయస్సులోనే పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2013 నుంచి 2014 వరకు గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా పని చేశారు. ఆ తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం పీసీసీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్ఠానం మైనార్టీలకు కేటాయించడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే.. రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్‌ పదవిని హైకమాండ్ కట్టబెట్టింది. 2021 జూన్- 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్- 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలోప్రత్యేక ఆహ్వానితుడిగా, 2023 జూన్- 20న తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు

2023లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలనీ భావించిన మహేష్.. ఆ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీని పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపడంతో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో.. ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2024 జనవరి 29న తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. చూశారుగా.. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లోకి వచ్చి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ఇన్ని రోజులకు ఆయన కష్టానికి తగిన ఫలితం లభించబోతోందని కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.