పేదలు ఆత్మగౌరవంతో జీవించేలా చర్యలు
- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
విశ్వంభర, ఖమ్మం :పేదలు ఆత్మ గౌరవంతో జీవించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల, గృహ నిర్మాణ శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి కూసుమంచి మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ముందుగా పాలేరు గ్రామంలో మంత్రి వర్యులు పర్యటించి 5 కోట్లతో పాలేరు సరస్సు వద్ద చేపట్టనున్న పర్యాటక సౌకర్యాల అభివృద్ధి పనులకు, మల్లాయి గూడెం గ్రామంలో మల్లాయిగూడెం నుండి ఆంజనేయస్వామి దేవాలయం వరకు కోటి 35 లక్షలతో నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు, గట్టుసింగారం గ్రామంలో నూతనంగా నిర్మించనున్న విద్యుత్ నియంత్రికల మరమ్మతుల కేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పాలేరు లేక్ ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని, ప్రజలు, పర్యాటకులు ఆహ్లాదంగా గడిపే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. లేక్ దగ్గర చేపట్టే పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్లాన్ పరిశీలించిన మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. రాబోయే వర్షాకాలం నాటికి మల్లాయి గూడెం గ్రామంలో కోటి 35 లక్షలతో చేపట్టిన బిటి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. గ్రామాలకు గత నెలన్నర రోజులలో నిధులు విడుదలయ్యాయని, మార్చి 31 లోపు మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. గ్రామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులు అభివృద్ధి పనులకు వినియోగించుకోవాలని అన్నారు. మల్లాయిగూడెం గ్రామ పరిధిలో దాదాపు 13 కోట్ల రూపాయలతో ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ మల్లాయిగూడెం నుంచి ఆంజనేయస్వామి టెంపుల్ వరకు కోటి 35 లక్షల రూపాయలతో చేపట్టిన బీ.టి రోడ్డు నిర్మాణ పనులకు నేడు మంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం సంతోషంగా ఉందని, రాబోయే వానాకాలం కంటే ముందే ఈ పనులు పూర్తిచేసి ప్రజలకు రోడ్డును అందుబాటులోకి తీసుకొని రావాలని కలెక్టర్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్, పాలక వర్గానికి కలెక్టర్ శుభాకాంక్షలు తెలుపుతూ రాబోయే ఐదు సంవత్సరాలు బాగా పనిచేసి ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, ఖమ్మం ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ రవి కుమార్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.



