పటాన్ చెరులో మహిళా దినోత్సవం 

పటాన్ చెరులో మహిళా దినోత్సవం 

విశ్వంభర, సంగారెడ్డి: పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి ల ఆధ్వర్యంలో గురువారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు  అంబరాన్ని అంటాయి.  నియోజకవర్గ పరిధిలోని మహిళా ప్రజా ప్రతినిధులు, వేలాదిమంది మహిళలు కార్యక్రమానికి హాజరయ్యారు.  ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ అంశాలపై ప్రముఖులచే ఉపన్యాసాలు, బహుమతుల పంపిణీ కార్యక్రమాలు అందరిని ఉత్సాహపరిచాయి.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ,  ఒక కుటుంబంలో మహిళా విద్యావంతురాలు అయితే ఒక తరం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలు ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని కోరారు. సర్వైకల్ క్యాన్సర్ విముక్తి కోసం ప్రభుత్వం అందిస్తున్న హెచ్ పి వి వ్యాక్సిన్ ను బాలికలతో మొదలు మహిళలందరూ వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైన పక్షంలో పటాన్చెరు నియోజకవర్గంలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ప్రతి మహిళకు వ్యాక్సిన్ అందిస్తామని హామీ ఇచ్చారు. గత 25 సంవత్సరాలుగా పటాన్చెరు కేంద్రంగా మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఆడ కూతురు ఉన్నత చదువులు చదువుకోవాలన్న సమున్నత లక్ష్యంతో పటాన్చెరు పట్టణంలో కేజీ నుండి పీజీ వరకు ఆధునిక వసతులతో ప్రభుత్వ విద్యాసంస్థలు నెలకొల్పడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: