‘అరకు కౌని’ మిల్లెట్ మీల్
- ఆర్గానిక్ మిల్లెట్ స్టాల్‌ను సందర్శించిన సీఎం చంద్రబాబు
విశ్వంభర, అమరావతి: అరకు కౌని’ పేరుతో రూపొందించిన తొలి గిరిజన ఆర్గానిక్ మిల్లెట్ ఫుడ్ మెనూను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం 6వ జిల్లా కలెక్టర్ల సదస్సు రెండో రోజున ఏర్పాటు చేసిన ఈ ఆర్గానిక్ మిల్లెట్ ఆహార ఉత్పత్తుల స్టాల్‌ను సీఎం చంద్రబాబు సందర్శించారు. గిరిజనులు పండించిన కొర్రలు, రాగులు, సామలు, కాకిజొన్నలు, గంట్ల, మొక్కజొన్న, కొండ కందులు, రాజ్మాతో చేసిన కొర్ర పాయసం, రాగి చపాతీ, సామల పులిహోర, కాంట్ల అంబలి, కార్న్ వడ, తూర్ దాల్ కర్రీ వంటి ఆహార ఉత్పత్తులను అక్కడ ప్రదర్శించారు. ఈ ఆహార ఉత్పత్తులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించి రుచి చూశారు. గిరిజనుల ఆహార సంప్రదాయాలను గౌరవిస్తూ ఆరోగ్యకరమైన మిల్లెట్ ఆహారాన్ని మరింత ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. టూరిజం, ఇండియన్ కలినరీ ఇన్‌స్టిట్యూట్ కలిసి రాష్ట్రంలోని స్టార్ హోటళ్లు, ఆతిథ్య సంస్థలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నాయని సీఎంకు అధికారులు తెలిపారు. ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో ‘అరకు కౌని’ వంటకాలను వారి మెనూలో చేర్చడం ద్వారా గిరిజన మిల్లెట్ మీల్స్‌ను ప్రోత్సాహించాలన్నారు. మిల్లెట్ థాళీని పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు...జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, అధికారులు పాల్గొన్నారు.



