డ్రగ్స్ జోలికి వెళ్లొద్దు
విశ్వంభర, ఇనుగుర్తి: గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు, మారకద్రవ్యాల జోలికి వెళ్ళొద్దని ఎస్సై కరుణాకర్ యువతకు సూచించారు.ఇనుగుర్తి మండలం చిన్ననాగారంలో గురువారం అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ, గంజాయి, డ్రగ్స్ కు ఒక్కసారి అలవాటు పడితే వాటిని వదులుకోవడం చాలా కష్టతరంగా మారుతుందని వీటితో జీవితాలు చిన్నాభిన్నమవుతాయని హెచ్చరించారు. గ్రామం నుంచి 12 మంది ఇటువంటి కార్యక్రమాల పట్ల ఆకర్షితులైనట్లు తమకు సమాచారం ఉందన్నారు. వెంటనే తీరు మార్చుకోవాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి పండించిన, విక్రయించిన,కొనుగోలు చేసిన చట్ట ప్రకారం నేరమన్నారు.వీటి సమాచారం ఎవరికైనా తెలిస్తే వెంటనే తమ దృష్టికి తేవాలన్నారు.డ్రగ్స్ వంటి మారకద్రవ్యాల వైపు యువత కన్నెత్తి చూడవద్దని చెప్పారు.కిరాణా షాపులలో కాలం చెల్లిన వస్తువులు అమ్ముతున్నారని సమాచారం అందుతోందని తమ కంటపడితే జరిమానాతో పాటు,చర్యలు తప్పవ న్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.



