ప్రజా సమస్యల పరిష్కారానికే "ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక"
- బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్
విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన" ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక" జూన్ 12 వరకు కొనసాగుతుందని, ప్రభుత్వం నిర్దేశించిన అన్ని కార్యక్రమాలను జయప్రదం చేయాలని, తెలంగాణ బీసీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ నూతీ శ్రీకాంత్ గౌడ్ అధికారులను కోరారు. గురువారం దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్, బీసీ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 99 రోజుల కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అందరినీ భాగస్వాములను చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను, కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కోరారు. పరిసరాల శుభ్రత అందరి బాధ్యత అని, ప్రతిరోజు పార్కులకు వచ్చే వాకర్లు ఈ ప్రత్యేక పరిశుభ్ర కార్యక్రమంలో భాగస్వాములను చేసేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. వేసవి ప్రారంభమైందని, దీనితో పాటు దోమల బెడద కూడా ప్రారంభమైంది కావున పారిశుద్ధ్య కార్యక్రమానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. రోడ్ల శుభ్రం, డ్రైన్ల శుభ్రం, అంగన్ వాడిలు, మార్కెట్లు, హాస్టళ్ళు, బస్టాండ్లలో శుభ్రత, రోడ్ల వెంట ఖాళీ ప్రదేశాలలో చెట్లపొదలు తొలగింపు, వంటి పనులు ఇందులో భాగం గా ఉంటాయని అన్నారు. రెవిన్యూ ఆగ్ మెంటేషన్ కింద కొత్త ఇండ్లు, పరిశ్రమలు, కమర్షియల్ భవనాల అసెస్మెంట్, ట్రేడ్ లైసెన్స్ జారీ, మార్కెట్లు షాపింగ్ కాంప్లెక్స్ వేలం పూర్తి 100 శాతం టాక్స్ ల వసూళ్లు ఇతర ఫీజులు వసూళ్ళు, 2026- 27 సంవత్సరానికి టాక్స్ల నిర్ధారణ,పంచాయతీలు, అంగన్ వాడీ భవనాలు, సిసి రోడ్ల నిర్మాణం వంటి పనులు, చేపడతారని వివరించారు.తాగునీటికి సంబంధించిన పైపుల రిపేర్, పైపులతో కొత్త కనెక్షన్లు వంటివి గుర్తింపు వాటి రిపేర్లు కొత్త కనెక్షన్లకు మెటీరియల్ సేకరణపై కార్యాచరణ ప్రణాళిక, అధికారులు తయారు చేస్తారని పంచాయతీ నిధులు 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం ఇతర వనరుల గుర్తింపు పూర్తి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషనర్ శ్రీమతి బాలమాయాదేవి, ఎండి మల్లయ్య భట్టు, సీఈఓ అలోక్ కుమార్, ఎం.డి.లు ఉదయ్ ప్రకాష్, శ్రీమతి ఇందిరా, శ్రీనివాస్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.



