మహిళా రైతుల డేటా సేకరించాలి

మహిళా రైతుల డేటా సేకరించాలి

విశ్వంభర, హైదరాబాదు : మహిళా రైతుల వివరాలను సమగ్రంగా సేకరించి వారి కోసం ప్రత్యేక విధానం రూపొందించాలని ఐఐటి మడ్రాస్ పీహెచ్డీ పరిశోధకురాలు వాణి ప్రశంస సూచించారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరంగా 2026ను ప్రకటించిన నేపథ్యంలో బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో మహిళా సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి డాక్టర్ పర్లపల్లి అరుణ దేవి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వాణి ప్రశంస మాట్లాడుతూ మహిళా రైతులు ఆర్థిక, సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. మహిళలు కష్టపడి వ్యవసాయం చేస్తున్నప్పటికీ వారిని రైతులుగా గుర్తించడం లేదన్నారు. వారసత్వ హక్కులు ఉన్నప్పటికీ మహిళల పేరుపై భూమి కేవలం 14.7 శాతం మాత్రమే ఉందని పేర్కొన్నారు. మహిళల పేరుపై భూములు పెరగాలంటే జాయింట్ పట్టాలు లేదా మహిళల పేరుతోనే పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.
పరుచూరి జమున మాట్లాడుతూ పితృస్వామ్య భావజాలం మహిళా రైతులను అణచివేస్తోందన్నారు. మహిళలు గ్రూపులుగా కోఆపరేటివ్ సంఘాలు ఏర్పాటు చేసుకుని వ్యవసాయం కొనసాగించేందుకు కేరళలో అమలులో ఉన్న కుడుంబశ్రీ తరహా పథకాన్ని తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. పశ్య పద్మ మాట్లాడుతూ,  రైతు, మహిళా ఉద్యమాల ఫలితంగానే ప్రపంచ ఆహార కార్యక్రమం, స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సూచనల మేరకు ఐక్యరాజ్యసమితి 2026ను మహిళా రైతుల సంవత్సరంగా ప్రకటించిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 41 శాతం మహిళలు వ్యవసాయంలో ఉన్నప్పటికీ దేశంలో, తెలంగాణలో మహిళా రైతుల పూర్తి వివరాలు లేవని పేర్కొన్నారు. మహిళా రైతులకు సాంకేతిక శిక్షణలు, శ్రమ తగ్గించే పరికరాలు అందించడంతో పాటు పోషకాహార పంటల ప్రణాళికను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సదస్సులో భాగం హేమంతరావు, పశ్య పద్మ, విజయలక్ష్మి పండిట్, సారంగపాణి, కొప్పోజు సూర్యనారాయణ, ప్రభులింగం, దొడ్డ వెంకటయ్య, మెడకంటి వెంకట్ రెడ్డి, ఒళ్ళు ప్రసాద్, కంబాల శ్రీనివాస్, డీ.జి. నరేంద్ర ప్రసాద్, స్వరూప, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags: