ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం
- మంత్రి సీతక్క
విశ్వంభర, మహబూబాబాద్: గ్రామాల్లోని సర్పంచులు, వార్డు కౌన్సిలర్లు గ్రామ ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తూ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం మహబూబాబాద్ పట్టణంలోని పి.ఎస్.ఆర్ ఫంక్షన్ హాల్ లో జిల్లా స్థాయిలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమములో భాగంగా నూతనంగా ఎన్నికైన మహబూబాబాద్ జిల్లాలోని గ్రామ సర్పంచులకు, మున్సిపల్ కౌన్సిలర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ, దేశంలోనే ఆదర్శ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దడానికి ప్రతి సర్పంచ్ కృషి చేయాలని అన్నారు. దేశానికి పట్టుకొమ్మలే గ్రామాలని గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రతి సర్పంచ్ తమ గ్రామాన్ని సొంత ఇంటితో భావించుకోవాలని, ప్రజా ప్రతినిధులు స్వార్థం కోసం పనిచేయకుండా ప్రజాసేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ప్రతి ప్రజా ప్రతినిధి ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని, పూర్తిస్థాయిలో సేవలు అందించినప్పుడే ప్రజల గుర్తింపు లభిస్తుందని అన్నారు. గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం 6 వందల కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు కేటాయించిందని, మరో 12 వందల కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నాయని ఆ నిధులను తీసుకోరావడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా గ్రామాలలో ప్రజా ప్రతినిధుల ప్రాతినిద్యం లేకపోయినప్పటికీ గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులు చేయడానికి రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ఒక వెయ్యి మూడు కోట్ల రూపాయలను కేటాయించిందని, ఆనాడు చేసిన పనులకు కొంత మేరకు బిల్లులు చెల్లించగా జరిగిందన్నారు, ఇటీవల సర్పంచులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినప్పటికీ నేడు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 దృష్టిలో ఉంచుకొని సర్పంచులకు, పురపాలక కౌన్సిలర్లకు 12 శాఖలపై అవగాహన కల్పించడానికి ఈ శిక్షణను ఏర్పాటు చేశామని, శిక్షణలో అవగాహన చేసుకున్న ప్రజాప్రతినిధులు తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తమ గ్రామ పంచాయతీలుగా గుర్తించడానికి తొమ్మిది రకాల అంశాలను పొందుపరచిందని, వాటిని అవగాహన చేసుకుని ఉత్తమ గ్రామ పంచాయతీలుగా గుర్తింపు పొందడానికి కృషి చేయాలని అన్నారు. ఉత్తమ గ్రామపంచాయతీ కోటి రూపాయలు, మరో రెండు గ్రామపంచాయతీలకు అదనంగా నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందని వివరించారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల షెడ్యూల్ ప్రకారం జిల్లాలో పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందని, అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి విజయవంతం చేయడం కోసం పక్క ప్రణాళికతో జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రాంచంద్రునాయక్, ఎం.ఎల్.సి తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మహబూబాబాద్ శాసన సభ్యులు డాక్టర్ బానోత్ మురళీ నాయక్, తదితరులు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరైన గ్రామపంచాయతీ సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్ వైస్ చైర్మన్లు ను ఉద్దేశించి ప్రసంగించి గ్రామాలు పట్టణాల అభివృద్ధి కోసం తీసుకోవలసిన చర్యలపై సూచనలు సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థలు, రెవిన్యూ అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, కె.అనిల్ కుమార్, మునిసిపల్ చైర్ పర్సన్ గుగులోతు జ్యోతి, వైస్ చైర్మెన్ సూర్నపు సోమయ్య, జెడ్పిసిఓ పురుషోత్తం, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, జిల్లా అధికారులు, జిల్లా అధికారులు,మునిసిపల్ కౌన్సిలర్లు, గ్రామ సర్పంచ్ లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.



