పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
- మండల విద్యాధికారి సలీం షరీఫ్
విశ్వంభర, కోదాడ: కోదాడ పట్టణంలో ఈనెల 14 నుండి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మండల విద్యాధికారి సలీం షరీఫ్ తెలిపారు. విద్యార్థులు ఎవరు ఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని పేర్కొన్నారు. కోదాడ పట్టణంలో 11 పరీక్ష కేంద్రాల్లో లోటుపాట్లు తలెత్తకుండా, కట్టదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్లను అనుమతించడం లేదని, పరీక్ష కేంద్రానికి సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించామన్నారు. పట్టణంలో 1485 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. 130 మంది సిబ్బంది తో, 11 సెంటర్లలో 22 మంది చీఫ్ సూపర్డెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తారని తెలిపారు. ప్రతి సెంటర్ కి పోలీస్ బందోబస్తు ఉంటుందని, పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా తాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, అవసరమైన ఫర్నిచర్తో పాటు వైద్య సేవలను అందుబాటులో ఉంచుతున్నాం అన్నారు. విద్యార్థులు పరీక్షల ఒత్తిడికి గురై ఆందోళన చెందవద్దని ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలన్నారు. తల్లిదండ్రులు ప్రశాంత వాతావరణం కల్పించాలని ఒక గంట ముందు విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఐదు నిమిషాలు ఆలస్యమైనా పరీక్షకు అనుమతిస్తారని ఆయన పేర్కొన్నారు. ప్రశ్నపత్రాలను సీసీ కెమెరాల ఎదుటే తెరిచేలా ఏర్పాటు చేశామని ప్రతి పరీక్ష కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన తెలిపారు.



