రౌడీషీటర్‌కు జైలు శిక్ష 

రౌడీషీటర్‌కు జైలు శిక్ష 

విశ్వంభర, రాజేంద్రనగర్ : బైండోవర్ నిబంధనలు ఉల్లంఘించిన రౌడీషీటర్‌కు న్యాయస్థానం ఒక నెల జైలు శిక్ష విధించింది. ఈ ఘటన ఫలక్‌నుమా డివిజన్ పరిధిలో జరిగినట్లు రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ తెలిపారు. కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మహ్మద్ రియాజుద్దీన్ అలియాస్ రియాజ్‌పై రౌడీషీట్ నమోదు ఉంది. గతంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ముందు బైండోవర్ చేయగా నేరాలకు పాల్పడబోనని బాండ్ రాసి ఇచ్చాడు. అయితే బైండోవర్ కాలంలోనే మళ్లీ నేరానికి పాల్పడటంతో కామాటిపుర పోలీసులు కేసు నమోదు చేసి హైదరాబాద్ జిల్లా స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కె. జ్యోతి ముందు ప్రవేశపెట్టారు. విచారణ అనంతరం నిందితుడికి 30 రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. నగరంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని డీసీపీ తెలిపారు.

Tags: