స్కూల్‌లో ఆడుతూ కుప్పకూలి..

స్కూల్‌లో ఆడుతూ కుప్పకూలి..

  • 9 ఏళ్ల బాలికకు కార్డియాక్‌ అరెస్ట్‌

విశ్వంభర, నేషనల్ బ్యూరో:  రాజస్థాన్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్కూల్‌లో ఆడుకుంటూ కుప్పకూలి ఓ 9 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. కార్డియాక్‌ అరెస్ట్‌ కారణంగానే ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు అనుమానిస్తున్నారు. మూడు రోజుల కిందట జరిగిన ఈ ఘటన  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.రాజస్థాన్‌లోని  నాగౌర్‌ జిల్లా గోటన్‌కు చెందిన రాజేంద్ర బపేడియా 9 ఏళ్ల కుమార్తె దివ్య స్థానికంగా ఉన్న ఓ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో 5వ తరగతి చదువుతోంది. ఫిబ్రవరి 23న ఆ బాలిక ఎప్పటిలాగే పాఠశాలకు వచ్చింది. ఉదయం ప్రేయర్‌కు సమయం ఉండటంతో తోటి పిల్లలతో కలిసి స్కూల్‌ గ్రౌండ్‌లో ఆడుకుంది. ఆ సమయంలో దివ్య ఉన్నట్టుండి కుప్పకూలింది. పాఠశాల సిబ్బంది వెంటనే ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆ బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. బాలిక శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, కార్డియాక్ అరెస్ట్‌ వల్లే మరణించి ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు.కాగా.. కొన్ని నెలల క్రితం దివ్య అన్న అభిషేక్‌ కూడా ఇలాగే మరణించినట్లు తెలుస్తోంది. గతేడాది సెప్టెంబరులో ఆ బాలుడు ఇంట్లో ఆడుకుంటూ కుప్పకూలాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేసరికే ప్రాణాలు కోల్పోయాడు. నెలల వ్యవధిలో చిన్నారులిద్దరూ మరణించడంతో రాజేంద్ర కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

Tags: