హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి లేఖ
ఇద్దరు అధికారుల పేర్లు పంపాలని కోరిన కేంద్రమంత్రి
హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ పనుల పురోగతిపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మెట్రో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన తక్షణ చర్యలను ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు.
విశ్వంభర, తెలంగాణ, బ్యూరో: హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణ పనుల పురోగతిపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మెట్రో ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన తక్షణ చర్యలను ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. ఇటీవల కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో జరిగిన భేటీ వివరాలను కిషన్ రెడ్డి ఈ లేఖలో వివరించారు. మెట్రో మొదటి దశను L&T సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం (Takeover) చేసుకుంటుందని ఇప్పటికే సీఎం ప్రకటించిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. రెండో దశ పనులకు కేంద్రం సహకారం అందించాలంటే, ముందుగా మొదటి దశకు సంబంధించిన ఒప్పందాలు, లావాదేవీలు, టేకోవర్ ప్రక్రియ పూర్తి కావాలని కేంద్ర మంత్రి ఖట్టర్ స్పష్టం చేసినట్లు లేఖలో పేర్కొన్నారు.
సంయుక్త కమిటీ ఏర్పాటులో జాప్యం
మెట్రో మలిదశ సన్నాహాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో ఒక సంయుక్త కమిటీ (Joint Committee) ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి ఇద్దరు, రాష్ట్రం నుంచి ఇద్దరు అధికారులతో ఈ కమిటీ ఏర్పడాలని, కేంద్రం తన వంతు ప్రక్రియకు సిద్ధంగా ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారుల పేర్లు ప్రతిపాదించలేదని కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించిందని, ఈ ప్రాజెక్టు వేగంగా పట్టాలెక్కాలంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇద్దరు అధికారుల పేర్లను పంపాలని లేఖలో పేర్కొన్నారు.
ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూపు
మెట్రో ఫేజ్-2పై కేంద్రం సానుకూలంగా ఉన్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేస్తూ అధికారుల పేర్లను ఎప్పుడు పంపుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ కమిటీ ఏర్పాటుతో మెట్రో విస్తరణ పనుల్లో ఉన్న సాంకేతిక, ఆర్థిక అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఉంది.



