బీసీ బిల్లును 9వ షెడ్యూల్ లో చేర్చాలి
విశ్వంభర, బషీర్ బాగ్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు వద్దని తమిళనాడు రాష్ట్రం తరహాలో 9వ షెడ్యూల్డ్ లో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్, విశ్రాంత ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు, తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఛైర్మన్ బాలగోని బాలరాజ్ లు డిమాండ్ చేశారు. ఫోరం, ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో “పార్లమెంట్- శాసన సభ బడ్జెట్ సమావేశాలు నేపథ్యంలో బీసీ బిల్లులపై' చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 16న నుంచి జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీసీలకు 50 వేల కోట్లు నిధులు కేటాయించాలన్నారు. బీసీలపై రోజురోజు దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న నేపధ్యంలో బీసీ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని వారు కోరారు. పెండింగ్ లో ఉన్న బీసీ విద్యార్థుల ఫీజుల రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్, బీసీ కార్పోరేషన్ కు నిధులు కేటాయించాలన్నారు. బీసీలపై ఉన్న క్రిమిలేయర్ ను ఎత్తివేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. మూడు రాజకీయ పార్టీలు బీసీలను అణగదొక్కే కుట్రను మానుకోవాలన్నారు. లేని పక్షంలో బీసీ లోకం తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. ఈ చర్చా కార్యక్రమానికి బైరి శేఖర్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర కన్వీనర్ బీసీ పొలిటికల్ ఫ్రంట్ అయిలి వెంకన్నగౌడ్, ఎస్. దుర్గయ్యగౌడ్, ఎలికట్టి విజయ్ కుమార్, నారాయణగౌడ్, భత్తిని కీర్తిలత తదితరులు పాల్గొన్నారు.



