17న చట్టసభల్లో ఓంకార్ పాత్ర పై సమావేశం 

17న చట్టసభల్లో ఓంకార్ పాత్ర పై సమావేశం 

విశ్వంభర, హైదరాబాదు : చట్టసభల్లో అమరజీవి కామ్రేడ్ మద్ది కాయల ఓంకార్ పాత్రపై ఈ నెల 17న రవీంద్రభారతిలో నిర్వహించే రాష్ట్ర స్థాయి సభను విజయవంతం చేయాలి అని యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పిలుపునిచ్చారు. గురువారం బాగ్‌లింగంపల్లిలోని ఓంకార్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సభకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 12, 2025 నుంచి మే 12, 2026 వరకు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మాజీ శాసనసభ్యుడు, యంసిపిఐ(యు) వ్యవస్థాపక నేత మద్ది కాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ నెల 17న రవీంద్రభారతిలో “చట్టసభల్లో ఓంకార్ పాత్రపై రాష్ట్ర స్థాయి సభ” నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నుంచి ఐదు సార్లు శాసనసభ్యునిగా ఎన్నికై చట్టసభల్లో ప్రజా సమస్యలను ప్రస్తావించిన తీరు, అప్పటి రాజకీయ విలువలు, ప్రస్తుత చట్టసభల పరిస్థితులను విశ్లేషించే ఉద్దేశంతో ఈ సభ నిర్వహిస్తున్నట్లు వివరించారు. సభకు యంసిపిఐ(యు) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్ది కాయల అశోక్ ఓంకార్‌తో పాటు రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ధనసరి సీతక్క, జూపల్లి కృష్ణారావు, మాజీ స్పీకర్లు కే ఆర్ సురేష్ రెడ్డి, సిరికొండ మధుసూదన్ చారి, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బి వి రాఘవులు, సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె నారాయణ, మాజీ శాసనసభ్యుడు గుమ్మడి నరసయ్య తదితరులు హాజరవుతారని తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వల్లెపు ఉపేందర్ రెడ్డి, వనం సుధాకర్, కుంభం సుకన్య, పల్లె మురళి, డి మధుసూదన్ పాల్గొన్నారు.

Tags: