ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలి
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
విశ్వంభర, సూర్యాపేట: ప్రజలకు మంచి చేయాల్సిన బాధ్యత మనపై ఉందని, ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కొంత సమయం కేటాయిస్తే క్షేత్రస్థాయిలో మంచి మార్పు కనిపిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పాలక వర్గాలు లేక గ్రామాలకు నిధులు రాలేదని, గత నెలన్నర కాలంలో పెద్ద ఎత్తున నిధులు విడుదల అయ్యాయని, మార్చి 31 లోపు మరిన్ని నిధులు విడుదల అవుతాయని తెలిపారు. గురువారం ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా స్థానిక రవి ఫంక్షన్ హాల్ లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, మునిసిపల్ చైర్ పర్సన్, వార్డు కౌన్సిలర్ లు, ఇతర ప్రజా ప్రతినిధులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నలమాధ ఉత్తమ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి, రాష్ట్ర కేబినెట్ ఆలోచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని, ప్రజల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గురించి అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన లబ్ధిదారు లకు అవి చేరేలా చూడాలని తెలిపారు. ప్రతి గ్రామానికి జనాభా ఆధారంగా 5 లక్షల నుంచి 60 లక్షల రూపాయల వరకు నిధులు విడుదల అయ్యాయని, ఈ నిధులు ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని అన్నారు. చట్ట పరిధిలో నిధులను సద్వినియోగం చేయాలని, ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాకుండా కాపలాదారుగా ఉండాలని తెలిపారు.పేద ప్రజలకు నిరంతరం మంచి చేసే విధంగా, రాజకీయాలక తీతంగా ప్రభుత్వం పని చేస్తున్నదని అన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉంటాయని, ప్రస్తుతం గెలిచిన ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి ఆ ప్రాంతాల అభివృద్ధి కోసం పని చేయాలని కోరారు. ప్రతి ప్రాంత అభివృద్ధికి పార్టీలకతీతంగా తన సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ , రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం విజయవంతం చేసేందుకు స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయడం కీలకమని తెలిపారు. 99 రోజుల కార్యక్రమం పై స్థానిక ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేడు ఈ శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన సర్పంచ్, పట్టణ ప్రాంత ప్రజా ప్రతినిధులకు విధి నిర్వహణ, ప్రభుత్వ ముఖ్యమైన కార్యక్రమాలు ప్రజలకు అందించేందుకు ఉన్న నిబంధనలు విధివిధానాల గురించి తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో 99 రోజుల కార్యాచరణ చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి తమ గ్రామం, మున్సిపల్ వార్డు/డివిజన్ పరిధిలో నిబంధనల ప్రకారం బాగా పనిచేసి జాతీయస్థాయిలో ఆదర్శ వంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోదాడ శాసనసభ్యులు పద్మావతి రెడ్డి, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, అదనపు కలెక్టర్ కె. సీతారామారావు,జెడ్పీ సిఈఓ శిరీష, డిపిఓ యాదగిరి, సిపిఓ కిషన్, డివైఎస్ఓ వెంకట రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, సర్పంచులు, మునిసిపల్ చైర్ పర్సన్లు, వార్డు కౌన్సిలర్ లు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.



