ఇది 'లీకుల' ప్రభుత్వం: కేటీఆర్

ఇది 'లీకుల' ప్రభుత్వం: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు 'కాలక్షేప కథాచిత్రాలు' నడుపుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు 'కాలక్షేప కథాచిత్రాలు' నడుపుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సెట్ విచారణ ముగిసిన అనంతరం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై, సిట్ తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. విచారణ గదిలో ఆరుగురు అధికారుల మధ్య జరిగిన విషయాలు బయటకు ఎలా వస్తున్నాయని కేటీఆర్ ప్రశ్నించారు. "ఇది లీకు వీరుల ప్రభుత్వం. విచారణలో ఏమీ లేకపోయినా, బయటకు మాత్రం ఏదో జరిగిపోతోందని తప్పుడు లీకులు ఇస్తున్నారు. హీరోయిన్ల పేర్లు వాడుతూ మా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఇదే విషయం అధికారులను అడిగితే.. తాము మీడియాకు ఏమీ చెప్పలేదని నీళ్లు నములుతున్నారు" అని ఆయన విమర్శించారు.

పాత ప్రశ్నలనే అడుగుతూ వేధిస్తున్నారని, విచారణ పేరుతో సమయం వృథా చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. "మీకు ఏ నటులు ఫిర్యాదు చేశారు?" అని ప్రశ్నిస్తే అధికారులు సమాధానం చెప్పలేకపోయారని తెలిపారు. "ఇవాళ్టి విచారణలో నేను తప్ప ఏ ‘రావూ’ లేరు.. నన్ను ఎవరితోనూ కలిపి విచారించలేదు" అని స్పష్టం చేశారు.

Read More  టాంజానియాలో నల్గొండ జిల్లా వాసి మృతి - రోదిస్తున్న కుటుంబ సభ్యులు

బొగ్గు కుంభకోణంపై చర్యలేవి?
రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం మౌనంగా ఉందని కేటీఆర్ విమర్శించారు. హరీష్ రావు ఆధారాలతో సహా బయటపెట్టిన సింగరేణి టెండర్ల అక్రమాలపై చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు. బొగ్గు కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి బావమరిదే 'కింగ్ పిన్' అని, ఆయనపై చర్యలు తీసుకునే దమ్ము ప్రభుత్వానికి ఉందా? అని సవాల్ విసిరారు. "ఇప్పుడు మా ఫోన్లు ట్యాప్ అవ్వట్లేదా? అని అడిగితే అధికారులు మౌనం వహిస్తున్నారు" అని ఎద్దేవా చేశారు. ఎన్నిసార్లు విచారణ పేరుతో వేధించినా తట్టుకుంటామన్నారు. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని.. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని కేటీఆర్ స్పష్టం చేశారు.