కేటీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ సెగ

కేటీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ సెగ

రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరమైంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరమైంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ నందినగర్‌లోని కేటీఆర్ నివాసానికి చేరుకున్న పోలీసులు, ఆయనకు స్వయంగా ఈ నోటీసులు అందజేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక సమాచారం సేకరించేందుకు గాను కేటీఆర్‌ను విచారించాల్సిన అవసరం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విచారణాధికారుల ముందు హాజరు కావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితుల వాంగ్మూలాలు, దర్యాప్తులో వెలుగు చూసిన అంశాల ఆధారంగా కేటీఆర్‌ను ప్రశ్నించనున్నట్లు సమాచారం.

కేసు నేపథ్యమిదే
గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారవేత్తలు, చివరకు తమ పార్టీ నేతల ఫోన్లను కూడా అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలపై ప్రస్తుత ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు జైలులో ఉండగా, తాజాగా రాజకీయ నేతల వైపు దర్యాప్తు మళ్ళింది. కేటీఆర్ నివాసానికి పోలీసులు వెళ్లిన విషయం తెలియగానే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Read More ముగిసిన వాలీబాల్ టోర్నమెంట్

రాజకీయ ప్రకంపనలు
కేటీఆర్‌కు నోటీసులు అందడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని వారు ఆరోపిస్తున్నారు. అయితే, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, విచారణలో అన్ని నిజాలు బయటపడతాయని అధికార పక్షం స్పష్టం చేస్తోంది. రేపటి విచారణలో కేటీఆర్ ఎలాంటి సమాధానాలు ఇస్తారు? ఈ కేసు మరిన్ని మలుపులు తిరగబోతోందా? అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.