హరీశ్, కేటీఆర్‌లపై కవిత ఘాటు విమర్శలు

హరీశ్, కేటీఆర్‌లపై కవిత ఘాటు విమర్శలు

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు హరీశ్ రావు, కేటీఆర్‌లపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు హరీశ్ రావు, కేటీఆర్‌లపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వ్యవహారంలో ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నైనీ టెండర్ల విషయంలో హరీశ్ రావు వైఖరిని కవిత తీవ్రంగా తప్పుబట్టారు. "భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టగానే మా 'గుంట నక్క' (హరీశ్ రావు) రంగంలోకి దిగారు. ఆ మాటలను గుడ్డిగా నమ్మి కేటీఆర్ కూడా ప్రెస్ మీట్ పెట్టారు" అని ఎద్దేవా చేశారు.

ఈ వ్యవహారంలో సృజన్ రెడ్డి కేవలం చిన్న చేప మాత్రమేనని, అసలు తిమింగలం లాంటి కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డిని కాపాడేందుకే హరీశ్ రావు తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. ఒక కాంట్రాక్టర్‌కు అన్యాయం జరుగుతోందని బీఆర్‌ఎస్ ఆవేదన చెందడం హాస్యాస్పదమని మండిపడ్డారు.

Read More జాగృతి జనం బాటలో భాగంగా కృష్ణవేణి   టాలెంట్ స్కూల్  సందర్శన

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తీరుపై కవిత సెటైర్లు వేశారు. ఈ కేసు విచారణ రెండేళ్లుగా సాగుతూ.. ఏళ్ల తరబడి సాగే 'కార్తీకదీపం' సీరియల్‌ను తలపిస్తోందని విమర్శించారు. కేవలం ఎన్నికల లబ్ధి కోసమే దీనిని వాడుకుంటున్నారని ఆరోపించారు. తీవ్రవాదుల కోసం వాడాల్సిన ట్యాపింగ్‌ను రాజకీయాల కోసం వాడటం సరికాదని, బాధితులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

కొత్త పార్టీపై సంకేతాలు: ‘జాగృతి పార్టీ’లో చేరండి!

తన రాజకీయ భవిష్యత్తుపై కవిత స్పష్టతనిస్తూనే, కొత్త పార్టీ పేరుపై హింట్ ఇచ్చారు. తాను కాంగ్రెస్‌లో చేరుతానన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను కొట్టిపారేశారు. "నేను కాంగ్రెస్‌లో చేరను. మీరే జాగృతి పార్టీలో చేరండి. భవిష్యత్తులో నేను స్థాపించే పార్టీనే అధికారంలోకి వస్తుంది.. అప్పుడు మీకు కీలక పదవి ఇస్తా" అని వ్యాఖ్యానించారు. దీనితో ఆమె స్థాపించబోయే కొత్త పార్టీ పేరు 'తెలంగాణ జాగృతి'అని ఉండబోతోందనే చర్చ మొదలైంది.