బేటి జన్మోత్సవ్ కార్యక్రమం

బేటి జన్మోత్సవ్ కార్యక్రమం

విశ్వంభర, సంగారెడ్డి: మహిళా శిశు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బాలికల పట్ల గౌరవం, భద్రత, విద్య, సాధికారతను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహిస్తున్న “బేటి జన్మోత్సవ్ కార్యక్రమం”లో భాగంగా బాలిక పుట్టిన కుటుంబాలను అభినందిస్తూ ప్రశంసాపత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా సంగారెడ్డిలో నిర్వహించిన కార్యక్రమంలో స్వప్న కి బాలిక పుట్టిన సందర్భంగా కుటుంబం చూపిన సానుకూల దృక్పథాన్ని అభినందిస్తూ ప్రశంసాపత్రంతో పాటు ఆరోగ్య రక్షణ కిట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. ఎం. వసంతరావు మాట్లాడుతూ, బాలికలు కుటుంబానికి మాత్రమే కాక సమాజానికి కూడా అమూల్యమైన సంపద. బాలిక పుట్టిన సందర్భాన్ని ఆనందంగా జరుపుకోవడం ద్వారా సమాజంలో సానుకూల దృక్పథం పెంపొందుతుంది. ప్రతి కుటుంబం బాలికల విద్య, ఆరోగ్యం , సాధికారతకు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే సమానత్వంతో కూడిన అభివృద్ధి సాధ్యమవుతుంది అని తెలిపారు. అలాగే బిడ్డ పుట్టిన వెంటనే అవసరమైన టీకాలు వేయించాలని, తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని, తల్లి–బిడ్డలు ఆరోగ్యంగా ఉండేందుకు సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా బాలికల ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ప్రధాన లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్య అధికారి డా. మురళీకృష్ణ, వైద్యులు డా. నాగనిర్మల, డా. శశాంక్, జిల్లా మహిళా సంక్షేమ అధికారి శ్రీమతి లలిత కుమారి, ఇతర అధికారులు ఉదయ్‌కుమార్, వీరాంజనేయులు, రాము తదితరులు పాల్గొన్నారు.

Tags: