బండ కొత్తపల్లిలో బడి బాట
విశ్వంభర, గుండాల: మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల బండకొత్తపల్లి ప్రధానోపాధ్యాయులు సుధాకర్ ఎర్ర ఆధ్వర్యంలో బండ కొత్తపల్లి గ్రామంలో ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రుల గృహ దర్శనం చేసి 2026-27 వచ్చే విద్య సంవత్సరానికి పాఠశాలలో నమోదు చేసుకోవాలని తెలియజేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ తప్పకుండా విద్యార్థులను పాఠశాలలో జాయిన్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగినది. పాఠశాల నడుస్తున్న తీరు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధతో అనేక రకాల సౌకర్యాలను కల్పిస్తుందని ఉచితంగా పుస్తకాలు పంపిణీ , రెండు జతల యూనిఫామ్, నోటు పుస్తకాలను అందిస్తుందని , ప్రతి విద్యార్థికి పౌష్టికాహారం అందించడానికి ఉదయం రాగి జావ, మధ్యాహ్న భోజనం, చదువులో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఎఫ్ ఎల్ ఎన్ మరియు ఎఫ్ ఎల్ ఎస్ కార్యక్రమాలను పాఠశాలలో ప్రత్యేకంగా నిర్వహిస్తుందని , ఆంగ్ల మాధ్యమ బోధనతో , 20 సంవత్సరాల బోధన అనుభవం కలిగిన ఉపాధ్యాయులతో బోధిస్తూ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేసే అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతున్నందున విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ప్రధానోపాధ్యాయులు ఎర్ర సుధాకర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తిరుపతి, అంగన్వాడీ టీచర్ విక్టోరియా ,రమాదేవి, సోమనర్శయ, మహేష్, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.



