స్త్రీలపై హింస అరికట్టాలి
విశ్వంభర, బాగ్ లింగంపల్లి: స్త్రీలు, పిల్లలు ఎదుర్కొంటున్న హింస, వివక్ష కారణంగా ముఖ్యంగా పేద వర్గాల మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారని, భయం, అభద్రత మధ్య జీవించాల్సిన పరిస్థితులు కొనసాగుతున్నాయని పీసీపీసీ కన్వీనర్ అనురాధ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అమన్ వేదిక స్వచ్ఛంద సంస్థ, పీపుల్స్ కలెక్టివ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఇల్లు, ఆహారం, ఆరోగ్యం, విద్య వంటి ప్రాథమిక హక్కులు లేకుండా అనేక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని పేర్కొన్నారు. పిల్లల సంరక్షణకై నిర్వహించిన అధ్యయనంలో ఈ సమస్యలు బయటపడ్డాయని తెలిపారు. హింసను ఎదుర్కొని ముందుకు వచ్చిన తల్లులు, రెయిన్బో హోమ్స్‌లో చదివిన యువత ఈ అధ్యయనంలో పాల్గొన్నారని చెప్పారు. స్త్రీల భద్రత, పిల్లల హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వ విధానాలు మరింత బలోపేతం కావాలని సూచించారు. చట్టాల అమలులో కఠిన చర్యలతో పాటు సమాజంలో అవగాహన పెంపు అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబిక, శ్రీలత, గుప్తా జోష్ణ, సంధ్య, వెంకట్ రెడ్డి, షకీల్, ఇందిరా, శివ, క్రాంతి కిరణ్, పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.



