ధాన్యం ఆరబెట్టుకోవడానికి స్థలాన్ని ఇవ్వండి
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని చాలా గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి, కానీ ఇతరుల కబ్జాలో ఉన్నాయి. గ్రామాల్లోని రైతులు తాము పండించిన పంటను కోసి ఆరబెట్టుకోవడానికి స్థలాలు లేక ప్రభుత్వ మద్దతు ధర క్వింటాలుకు రూ.2,360/- ఉన్నప్పటికీ, అకాల వర్షాలకు భయపడి అతి తక్కువ ధరలకు దళారులకు క్వింటాలుకు రూ.1,700 నుంచి 1,800 లకే అమ్ముకోవాల్సిన పరిస్థితి. యాసంగి సీజను వరిచేలు కోతకు సిద్ధం అవుతున్నాయి, అనుకోకుండా అకాల వర్షాలకు వరిపంటలు అడ్డంపడి నేలపాలు అయ్యే ప్రమాదం ఉంది, అప్పటి పరిస్థితులు చూడలేక వరిపంట కోసి దళారులకు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. పంటలు కోతకు సిద్ధం అయ్యే సమయానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయకపోవడం శోచనీయం అని రైతులు వాపోతున్నారు. ప్రతి ఊర్లో ఉన్న ప్రభుత్వ భూములను రైతులకు వారి ధాన్యం ఆరబెట్టుకోవడానికి ఎప్పటికీ ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని, మండల తహసిల్దార్, ఇతర సంబంధిత అధికారులకు ప్రభుత్వ భూములను వెలికి తీసేలా ఆదేశాలిచ్చి, శ్రద్ధ చూపాలని, ఏదో ఒక శాశ్వత పరిష్కారం దిశగా ఆలోచన చేయాలని, ఇది రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని రైతులు కోరుతున్నారు. రైతులు కూడా తమ సాగు చేయని, లేదా పంట వేయని భూములు ధాన్యం ఆరబెట్టుకోవడానికి ఇమ్మని అడిగినా, ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ధాన్యం ఆరబెట్టుకోవడానికి భూములకు తాము అద్దె లాగా ఇస్తామని రైతులు అన్నా కూడా గ్రామ ప్రజలు ఇవ్వడం లేదు. ముందుగా ప్రతీ గ్రామంలో ఎంత ప్రభుత్వ భూములు ఉన్నాయో లెక్క తీసి, వాటిని ధాన్యం ఆరబెట్టుకోవడానికి రైతులకు ఉపయోగపడేలా ఏర్పాట్లు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, రైతులు కోరుతున్నారు. ఈ విషయమై అప్పటి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కూడా ఈ దిశగా ప్రయత్నం చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.



