ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న  దొంగల ముఠా అరెస్టు

ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న  దొంగల ముఠా అరెస్టు

విశ్వంభర, సంగారెడ్డి : ఆలయాలను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ జిల్లా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి భారీగా బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ నెల 10వ తేదీన అశోక్ నగర్‌లోని శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు వేగంగా ఛేదించారు. ఆలయ నిర్వాహకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.అరెస్టు చేసిన నిందితులు కందడ మహేందర్ రెడ్డి, ఉప్పు సాయి కుమార్, నమలి శ్రీనివాస్‌గా గుర్తించారు. వీరిలో మహేందర్ రెడ్డి పై 27 కేసులు, సాయి కుమార్ పై 11 కేసులు, శ్రీనివాస్ పై 10 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా, నిందితులు ముందుగా ఆలయాల వద్ద రెక్కీ నిర్వహించి, సీసీటీవీ కెమెరాలు లేకపోవడం, భద్రతా లోపాలు ఉన్న ఆలయాలను లక్ష్యంగా ఎంచుకునేవారని తేలింది. అనంతరం రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడి బంగారం, వెండి ఆభరణాలను అపహరించేవారు. నిందితుల వద్ద నుంచి సుమారు 6.2 తులాల బంగారం, 8 కిలోల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కిరీటం, నాగభరణం, పూజా సామాగ్రి వంటి విలువైన వస్తువులు ఇందులో ఉన్నాయి.శేరిలింగంపల్లి జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్, అదనపు డీసీపీ ఉదయ్ రెడ్డి పర్యవేక్షణలో ఆర్సీ పురం పోలీసులు ఈ కేసును ఛేదించినట్లు అధికారులు తెలిపారు. కేసును త్వరగా ఛేదించిన బృందాన్ని డీసీపీ అభినందించారు.అలాగే ఆలయ నిర్వాహకులు తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు, అలారం వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలని, రాత్రి వేళల్లో భద్రతా సిబ్బందిని నియమించుకోవాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Tags: