పేకాటరాయుళ్ళపై పోలీసుల ఉక్కుపాదం
- రూ.76,400 నగదు, 10 మొబైల్ ఫోన్లు, 4 బైకులు స్వాధీనం
- అంతరాష్ట్ర సరిహద్దు వెంట అర్థరాత్రి పోలీస్ రైడ్
విశ్వంభర, సూర్యాపేట: చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని, నిందితులు ఎంతటివారైనా కఠినచర్యలు తప్పవని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. 16వ తేది అర్ధరాత్రి సమయంలో కోదాడ పట్టణ పోలీసులు, స్పెషల్ బ్రాంచి పోలీసులు సంయుక్తముగా మెల్లచెరువు మండల పరిది రామాపురం, భూడాడు గ్రామాల సరిహద్దు శివారులో నిర్మానుష్య ప్రాంతంలో పేకాట నిర్వహిస్తున్న, ఆడుతున్నవారిపై దాడులు నిర్వహించి 9 మంది పేకాటరాయుళ్లను ఆరెస్ట్ చేసి, 4 ద్విచక్ర వాహనాలు, 10 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో రూ.76,400 నగదును సీజ్ చేశారు. పేకాట వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన, వ్యవస్థీకృతంగా నిర్వహించిన, సహకరించిన అలాంటి వారిపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు. ప్రజలు ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరముగా ఉండాలని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై జిల్లా పోలీస్ శాఖ ఉక్కు పాదం మోపుతుందని, ఇసుక అక్రమ రవాణా చేసినా, ప్రభుత్వ పంపిణీ బియ్యాన్ని అక్రమంగా వ్యాపారం నిర్వహించినా , పశువులను జంతువులను అక్రమంగా రవాణా చేసిన అలాంటి వారిపై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు.



