జర్నలిస్టుల పోరాటానికి జాగృతి మద్దతు
- ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలి
- జాగృతి రాష్ట్ర కార్యదర్శి భానోత్ కిసాన్ నాయక్
విశ్వంభర, ఖమ్మం: ఇండ్ల స్థలాల కోసమై గత రెండు రోజులుగా జర్నలిస్టులు చేస్తున్న పోరాటానికి మద్దతు పలుకుతూ, జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని జాగృతి రాష్ట్ర కార్యదర్శి కిషన్ నాయక్, జాగృతి జిల్లా అధ్యక్షురాలు గట్టు కరుణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం ప్రెస్ క్లబ్లో సోమవారం నుండి గత రెండు రోజులుగా ఇళ్ల స్థలాల సాధనకు జర్నలిస్టులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా జర్నలిస్టులను ఉద్దేశించి మాట్లాడుతూ... జర్నలిస్టులకు ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. గత పాలకులు జర్నలిస్టులకోసం 23.02 ఎకరాల భూమిని కేటాయించారని, ప్రస్తుత పాలకులు వారిచ్చిన హామీ మేరకు వెంటనే ఇండ్ల స్థలాలను జర్నలిస్టులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు గత రెండు సంవత్సరాలుగా అక్రిడిటేషన్ కార్డులు కూడా మంజూరు చేయక ఇబ్బంది పడుతున్నారని, డిజిటల్ మీడియా, కేబుల్ ఛానల్స్, పిడిఎఫ్ పత్రికలకు కూడా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి తక్షణమే పరిష్కరించే దిశగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించకపోతే జాగృతి ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా కార్యదర్శి వనం నాగేందర్ బంజారా జాగృతి జిల్లా అధ్యక్షులు జి రాజ్ కుమార్ నాయక్, యువజన సంఘ నాయకులు ఎస్.కె ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.



