సమాజ శ్రేయస్సు కు కలసి పనిచేద్దాం
- ఎస్పీ డా. శబరీష్
విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ, రోడ్డు ప్రమాదాల నివారణ, మత్తు పదార్థాల నిర్మూలన, సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు మహబూబాబాద్ టౌన్‌లోని పిఎస్ఆర్ ఫంక్షన్ హాల్‌లో విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని గ్రామ సర్పంచులు, వార్డ్ సభ్యులు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, ప్రమాదాల ప్రధాన కారణాలు, నిర్లక్ష్యం వల్ల కలిగే ప్రాణ నష్టం గురించి వివరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. "ఆర్రైవ్ అలైవ్ " కార్యక్రమం ద్వారా సురక్షిత ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు. డ్రగ్స్, గంజాయి వాడకం వల్ల యువత భవిష్యత్తు ఎలా దెబ్బతింటుందో వివరిస్తూ, మత్తు పదార్థాలపై ప్రత్యేక వీడియోలను ప్రదర్శించారు. గ్రామ స్థాయిలోనే డ్రగ్స్ నిర్మూలనకు ప్రజాప్రతినిధులు ముందుండాలని, యువతను సరైన మార్గంలో నడిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, భద్రత కోసం రూపొందించిన చెక్ లిస్ట్ పోస్టర్‌ను కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులందరి చేత ఆవిష్కరించారు. గ్రామాల్లో అమలు చేయాల్సిన ముఖ్య భద్రతా చర్యలు, యువత మార్గదర్శక అంశాలు ఇందులో పొందుపరచబడ్డాయని అన్నారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ డా. శబరీష్ మాట్లాడుతూ , “సమాజంలో మంచి మార్పు తీసుకురావడంలో గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషిస్తారు, యువతను మత్తు పదార్థాల నుండి దూరంగా ఉంచడం, ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించడం, ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయించడం ద్వారా నేరాలను అరికట్టవచ్చు. గ్రామాభివృద్ధి, యువత భవిష్యత్తు కోసం మీరు ముందుండి పనిచేయాలని అన్నారు. పోలీసు శాఖ ఎల్లప్పుడూ ప్రజల భద్రత కోసం కట్టుబడి ఉంది. ప్రజల సహకారం ఉంటేనే సమాజంలో శాంతి, భద్రతలు మెరుగుపడతాయి.” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ లు గండ్రతి మోహన్, తిరుపతి రావు, కృష్ణ కిషోర్, సీఐలు, ఎస్.ఐలు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.



