ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత సీట్ల భర్తీకి డిమాండ్
విశ్వంభర, రామన్నపేట: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రైవేట్, అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) - 2009 ప్రకారం 25 శాతం ఉచిత సీట్లను తక్షణమే భర్తీ చేయాలని "విద్య నిర్విఘ్న ఫౌండేషన్" వ్యవస్థాపక అధ్యక్షులు బొల్గూరి ముఖేష్ డిమాండ్ చేశారు. మంగళవారం నల్గొండ జిల్లా విద్యాశాఖాధికారికి ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ముఖేష్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత సీట్ల కేటాయింపును ఒక 'జాతీయ మిషన్' (నేషనల్ మిషన్) గా భావించాలని స్పష్టం చేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం వారి ప్రాథమిక హక్కు అని, దీనిని అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదని కోరారు. ఈ ఫౌండేషన్ ప్రధాన డిమాండ్లు ప్రధానంగా: 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ విడుదల చేసి, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రక్రియ పూర్తి చేయాలని, జిల్లాలోని ప్రతి ప్రైవేట్ పాఠశాలలో ఉన్న మొత్తం సీట్లు, 25 శాతం కోటా కింద అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను డిజిటల్ పోర్టల్, నోటీసు బోర్డుల్లో బహిర్గతం చేయాలని, ఎంపికైన పేద విద్యార్థుల నుండి యూనిఫాం, పుస్తకాలు వంటి ఇతర అంశాల పేరుతో ఎటువంటి ఫీజులు వసూలు చేయకూడదని, ఆన్‌లైన్ దరఖాస్తులు చేసుకోలేని తల్లిదండ్రుల కోసం ప్రత్యేక 'హెల్ప్ -డెస్క్‌లు' ఏర్పాటు చేయాలని, గత కొన్నేళ్లుగా అవకాశం కోల్పోయిన విద్యార్థుల కోసం 2వ తరగతి నుండి 5వ తరగతి వరకు వయస్సు ప్రాతిపదికన సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాను విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) అమలులో ఆదర్శ జిల్లాగా నిలపాలని, ఏప్రిల్ 30 లోపు మండల స్థాయి కార్యచరణ నివేదికను విడుదల చేయాలని వారు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు, చరణ్యశ్రీ ఫౌండేషన్ చైర్మన్ దోమలపల్లి గోపి, జన్నపాల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.



