పురపోరులో ఒంటరిగానే పోటీ: రాంచందర్ రావు

పురపోరులో ఒంటరిగానే పోటీ: రాంచందర్ రావు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రణరంగం వేడెక్కింది. ఫిబ్రవరి 11న రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం కీలక సమావేశం జరిగింది. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రణరంగం వేడెక్కింది. ఫిబ్రవరి 11న రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు పరోక్షంగా చేతులు కలిపాయని రాంచందర్ రావు ఆరోపించారు. గత ప్రభుత్వంలో జరిగిన స్కామ్‌లను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు. ఈ రెండు పార్టీలు ఒకే దారిలో నడుస్తూ బీజేపీని అడ్డుకోవాలని చూస్తున్నాయని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను ఓడించేందుకు ఈ రెండు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని, కానీ ప్రజలు వీరికి గుణపాఠం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని రాంచందర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. హోం, విద్య, మున్సిపల్ వంటి కీలక శాఖల బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు. రాష్ట్ర పరిపాలనను గాలికి వదిలేసి ఆయన విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నారని ప్రశ్నించారు. గులాబీ పార్టీ ఉనికిని కోల్పోతోందని ఎద్దేవా చేస్తూ.. "రాష్ట్రంలో ఇప్పుడు సార్ లేరు.. సర్కార్ లేదు.. కారు లేదు" అని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ క్రమంగా కనుమరుగవుతోందని, ఆ పార్టీకి పుట్టగతులు ఉండవని అన్నారు. ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో కూడా బీజేపీ పటిష్టంగా ఉందని, ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసి సత్తా చాటుతామని స్పష్టం చేశారు.

Read More నూతన సర్పంచ్ గుండాల అశోక్ ఉపసర్పంచ్ రాహుల్ గుప్తకు ఘన సన్మానం