తెలంగాణ రాజకీయాల్లో ‘అనర్హత’ సెగ

తెలంగాణ రాజకీయాల్లో ‘అనర్హత’ సెగ

 ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు మరో మలుపు తిరిగింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులు జారీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. నోటీసుల గ్రహీతలలో దానం నాగేందర్‌తో పాటు ఆయనపై అనర్హత పిటిషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఉన్నారు. వీరిద్దరూ ఈ నెల 30న స్పీకర్ ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంది.

సుప్రీంకోర్టు కొరడా.. స్పీకర్ యాక్షన్!
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 19న స్పీకర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తూ, చర్యలు తీసుకోకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే పెండింగ్‌లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ కదలిక మొదలైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read More  ప్రాణం ఉన్నంతవరకు నిరుపేదలకు సేవ చేస్తాం.- -డా. కోడి శ్రీనివాసులు

దానం కేసులో ‘బి-ఫామ్’ చిక్కులు
మిగిలిన ఎమ్మెల్యేలతో పోలిస్తే దానం నాగేందర్ కేసు భిన్నంగా ఉంది. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూనే, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా బి-ఫామ్ పై పోటీ చేశారు. ఇది స్పష్టమైన పార్టీ ఫిరాయింపు కిందకు వస్తుందని, బలమైన ఆధారాలు ఉన్నందున ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం మెండుగా ఉందని ప్రచారం జరుగుతోంది.

ఏడుగురికి క్లీన్ చిట్.. ముగ్గురిపై ఉత్కంఠ
మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు అందగా, స్పీకర్ ఇప్పటికే ఏడుగురికి 'క్లీన్ చిట్' ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య గుర్తింపు పొందారు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్ లకు సంబంధించి స్పీకర్ ఇంకా విచారణ జరపలేదు.

రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్తారా?
అనర్హత వేటు పడితే రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో, స్పీకర్ నిర్ణయం వెలువడక ముందే దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తద్వారా నేరుగా ఉప ఎన్నికలకు వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. 30వ తేదీన జరగబోయే విచారణలో దానం నాగేందర్ ఎలాంటి వివరణ ఇస్తారు? స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనే అంశంపై ఇప్పుడు యావత్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ దానం రాజీనామా చేస్తే హైదరాబాద్ రాజకీయాల్లో మరో ఉప ఎన్నిక పోరు తప్పదని తెలుస్తోంది.