వనదేవతల చెంత కేంద్ర మంత్రులు

అభివృద్ధికి సహకరించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్

వనదేవతల చెంత కేంద్ర మంత్రులు

మేడారం సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, జువాల్ ఓరం గురువారం దర్శించుకున్నారు. మేడారం చేరుకున్న వీరికి రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర ఘన స్వాగతం పలికారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మేడారం సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, జువాల్ ఓరం గురువారం దర్శించుకున్నారు. మేడారం చేరుకున్న వీరికి రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ములుగు జిల్లా కలెక్టర్ దివాకర ఘన స్వాగతం పలికారు. గిరిజన సంప్రదాయ డోలు–డప్పు వాయిద్యాల మధ్య మంత్రులకు స్వాగతం పలకగా, ఆలయ ప్రాంగణంలో పూజారులు, అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవార్ల దర్శనం అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా విద్య, వైద్య సదుపాయాలకు దూరంగా ఉన్న సుమారు 20 వేల ఆదివాసీ గ్రామాలను అభివృద్ధి చేసేందుకు జన్ ధన్ యోజన కింద సుమారు 24 వేల కోట్ల రూపాయలను కేటాయించినట్లు వెల్లడించారు. తెలంగాణలోని అచ్చంపేట, వికారాబాద్, ఆదిలాబాద్‌తో పాటు ములుగు లాంటి ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన గ్రామాలను ఈ నిధులతో సమగ్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 

ముఖ్యంగా ములుగు జిల్లాలో విద్యా విప్లవం తీసుకువచ్చేందుకు 890 కోట్ల రూపాయలతో గిరిజన యూనివర్సిటీని నిర్మిస్తున్నామని, దీనితో పాటు సుమారు 500 కోట్ల రూపాయల వ్యయంతో ఏకలవ్య పాఠశాలలను కూడా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి వివరించారు. రాష్ట్రంలోని ప్రతి గిరిజన గడపకు సంక్షేమ ఫలాలు అందేలా కేంద్రం నిరంతరం కృషి చేస్తోందని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గిరిజన విశ్వవిద్యాలయం కోసం భారీగా నిధులు కేటాయించడం, ఈ ప్రాంత యువతకు ఉన్నత విద్యావకాశాలను చేరువ చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణలో గిరిజన సంస్కృతిని కాపాడుతూనే, వారి ఆర్థిక పురోభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతి ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని మంత్రులు భరోసా ఇచ్చారు. మేడారం జాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు అవసరమైన శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని, తద్వారా ఈ క్షేత్రాన్ని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వారు వెల్లడించారు.

Read More  ఘోర రోడ్డు ప్రమాదం.. వ్వక్తి స్పాట్ డెడ్

కేంద్ర నిధుల వినియోగంలో రాష్ట్రం విఫలం.. 
మేడారం జాతరను సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వనదేవతల సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ వల్ల ఆ పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ములుగు జిల్లాలో ఏర్పాటు చేయనున్న గిరిజన యూనివర్సిటీకి సంబంధించి భూసేకరణ ప్రక్రియలో రాష్ట్రం చూపుతున్న జాప్యంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేంద్రం నిధులు సిద్ధంగా ఉంచినా, స్థలం కేటాయింపులో జరుగుతున్న ఆలస్యం వల్ల గిరిజన విద్యార్థులకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు.

జాతర ఏర్పాట్లపై కూడా మంత్రి తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, భక్తుల కోసం కల్పించాల్సిన కనీస సౌకర్యాలైన తాగునీరు, పారిశుధ్యం, వసతి కల్పనలో రాష్ట్ర యంత్రాంగం విఫలమైందని దుయ్యబట్టారు. క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందని, భక్తులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. కేంద్రం వివిధ పథకాల కింద అందిస్తున్న నిధులను రాష్ట్రం ఇతర అవసరాలకు దారిమళ్లిస్తోందని, గిరిజన పల్లెల అభివృద్ధి కంటే ప్రచారానికే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని ఘాటుగా విమర్శించారు. కేంద్రం సుమారు 24 వేల కోట్లతో ఆదివాసీ గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉందని చెబుతూ, రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి పనులకు సహకరించాలని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.