తెలంగాణకు భారీ 'స్టీల్' ప్లాంట్

తెలంగాణకు భారీ 'స్టీల్' ప్లాంట్

రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని 'తెలంగాణ రైజింగ్' బృందం దావోస్ వేదికగా అద్భుతాలు చేస్తోంది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని 'తెలంగాణ రైజింగ్' బృందం దావోస్ వేదికగా అద్భుతాలు చేస్తోంది. డక్టైల్ ఐరన్ (డీఐ) పైపుల తయారీలో గ్లోబల్ లీడర్ అయిన రష్మి గ్రూప్, తెలంగాణలో భారీ స్టీల్ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్-2026 వేదికగా నేడు రూ.12,500 కోట్ల పెట్టుబడికి సంబంధించి అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.ఈ మెగా ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో సుమారు 12,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. తయారీ రంగానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వ వ్యూహానికి రష్మి గ్రూప్ రాక మరింత బలాన్ని చేకూర్చింది. రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన బొగ్గు సరఫరా లింకేజీలు సహా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

శ్రీధర్ బాబు కృషితోనే ఈ విజయం
ఈ భారీ పెట్టుబడిని రాష్ట్రానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ భేటీలో కేవలం పరిశ్రమ స్థాపనే కాకుండా, పర్యావరణ హితమైన గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్, సర్క్యులర్ ఎకానమీ వంటి అంశాల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు రష్మి గ్రూప్ అంగీకరించింది. ఈ ప్లాంట్ 'లేబర్–ఇంటెన్సివ్' (ఎక్కువ మంది శ్రామికుల అవసరం ఉన్న) విధానంతో నడుస్తుందని, తద్వారా స్థానిక యువతకు మెరుగైన ఉపాధి దొరుకుతుందని కంపెనీ డైరెక్టర్ సంజిబ్ కుమార్ పట్వారి తెలిపారు. ఆసియా, యూరప్, ఆఫ్రికా, అమెరికా వంటి 40కి పైగా దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న రష్మి గ్రూప్ తెలంగాణను తన ప్రధాన కేంద్రంగా ఎంచుకోవడం రాష్ట్ర పారిశ్రామిక నైపుణ్యానికి నిదర్శనమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

Read More హైదరాబాదులో అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం -   తెలంగాణ రాష్ట్ర సమితి సమావేశం నేడే