మందు గంజాయి తాగొద్దు.. తల్లి దండ్రులకు గుండె కోత కానివ్వద్దు..
సంగారెడ్డి బోనాల జాతరలో యువతకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హితబోధ
- సంగారెడ్డిలో జరిగిన బోనాల పండుగను కుటుంబం, కార్యకర్తలు మరియు ప్రజల మధ్య జరుపుకున్న జగ్గారెడ్డి..
- పోతరాజుల నృత్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య స్టెప్పులేసిన జగ్గారెడ్డి.
- గంజాయి, మద్యాన్ని పక్కనబెట్టి భవిష్యత్తు గురించి ఆలోచించాలని పిలుపు
విశ్వంభర , హైదరాబాద్ :సంగారెడ్డిలో ఆదివారం రాత్రి అట్టహాసంగా నిర్వహించిన బోనాల జాతరలో యువతకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హితబోధ చేశారు. గంజాయి తాగితే నరాలు పనిచేయవని, ఎందుకు పనికిరాకుండా పోతారని సూచించారు. మద్యానికి కూడా దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రులను బాధపెట్టకుండా మంచి భవిష్యత్తు కోసం యువత శ్రమించాలని జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. గంజాయితోపాటు మత్తుపదార్థాల జోలికి వెళ్లి తల్లిదండ్రులకు గుండెకోత మిగల్చవద్దని కోరారు.తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని పదేపదే సూచించారు. జగ్గారెడ్డి సందేశాన్ని యువత ఆసక్తిగా విన్నారు. అంతకుముందు సంగారెడ్డి రాంనగర్‌లోని తన ఇంటి నుంచి బోనంతో జగ్గారెడ్డి బయల్దేరారు. తన సతీమణి టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, శివశక్తి నిషా క్రాంతి బోనాలు ఎత్తుకున్నారు. ఈ ఊరేగింపులో పోతరాజు నృత్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య జగ్గారెడ్డి స్టెప్పులు వేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలకు బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్పారు. అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు బాగా కురుస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.





