తెలుగు విశ్వవిద్యాలయంలో కుల వివక్ష 

  •  ఎస్సీ సెల్‌కు ఫిర్యాదు

విశ్వంభర, బాచుపల్లి: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో జర్నలిజం విభాగాధిపతి తనపై కుల వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ ఒక ఎస్సీ విద్యార్థి విశ్వవిద్యాలయ ఎస్సీ/ఎస్టీ సెల్‌కు మార్చి 31నఫిర్యాదు చేసారు. విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం, విభాగాధిపతి విద్యార్థులతో సమావేశాలకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడంలేదని ఆరోపించారు. అకాడమిక్ సమావేశాల్లో కూర్చోవడానికి సీటు ఇవ్వకుండా అవమానించడం, “మా విభాగమే తలనొప్పి” అంటూ వ్యాఖ్యలు చేయడం వంటి ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. అదేవిధంగా, సంబంధిత అధ్యాపకుడు తనను వాట్సాప్‌లో బ్లాక్ చేయడం వల్ల అకాడమిక్ విషయాలపై నేరుగా మాట్లాడే అవకాశాన్ని కూడా నిరాకరించారని తెలిపారు. ఈ చర్యలు యూజీసీ సమానత్వ నియమావళి (2025-26), కుల వివక్ష నిరోధక నోటిఫికేషన్ (2012), భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 17తో పాటు ఎస్సీ/ఎస్టీ అఘాతాల నివారణ చట్టం, 1989కు విరుద్ధమని విద్యార్థి ఫిర్యాదులో పేర్కొన్నారు.  వెంటనే విచారణ జరపాలని, సమాన హక్కులు, కమ్యూనికేషన్ అవకాశాలు కల్పించాలని, అధ్యాపకులకు కుల సమానత్వంపై అవగాహన కల్పించాలని కోరారు. అలాగే సంబంధిత విభాగాధిపతిని సస్పెండ్ చేసి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఫిర్యాదును యూజీసీ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, జిల్లా కలెక్టర్ , తెలంగాణ ఉన్నత విద్యా మండలికి కూడా పంపనున్నట్లు విద్యార్థి తెలిపారు. కాగా, ఈ అంశంలో విద్యార్థికి పూర్తి మద్దతు ఇస్తామని ఏఐఎస్ఓ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ ప్రకటించారు.

Tags: