రామన్నపేట అభివృద్ధిలో ఉప్పునూతుల, గుర్రంల పాత్ర మరువలేనిది
విశ్వంభర, రామన్నపేట: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రామన్నపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం 1994 లో
మాజీ మంత్రివర్యులు ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి సహకారంతో స్థానిక శాసనసభ్యులు గుర్రం యాదగిరి రెడ్డి రామన్నపేట షాపింగ్ కాంప్లెక్స్ భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగిందని రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి గౌరవ అధ్యక్షులు పోతరాజు శంకరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. 1952 నుంచి 2008 వరకు రామన్నపేట నియోజకవర్గాన్ని పరిపాలించిన ప్రతి శాసనసభ్యులు రామన్నపేటను అభివృద్ధి పరచడంలో ముందు వరుసలో ఉన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు అభివృద్ధి జరుగుతున్నది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రామన్నపేట నియోజకవర్గానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది. మండల వ్యాప్తంగా ఉన్న పెద్దలు, యువకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, పాత్రికేయ మిత్రులు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, విద్యావంతులు, సకల జనులు అందరూ కలిసి ఏకతాటిపై వచ్చి రామన్నపేట నియోజకవర్గాన్ని సాధించుకుందామని, రండి.. కదలి రండని, గల్లీ నుండి ఢిల్లీకి బయలు దేరుదామని రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి గౌరవ అధ్యక్షులు పోతరాజు శంకరయ్య ప్రజలను కోరారు.



