రోడ్డు భద్రత అందరి బాధ్యత
- పిల్లల రోడ్డు భద్రత దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం
విశ్వంభర, త్రిపురారం: త్రిపురారం మండలం కంప సాగర్ మోడల్ స్కూల్లో నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత ప్రత్యేక కార్యక్రమం మూడవ రోజు పిల్లల రోడ్డు భద్రత దినోత్సవం సందర్భంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నరేష్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు రోడ్డు భద్రత నియమాల ప్రాముఖ్యతను వివరించారు. చిన్న వయస్సులోనే రోడ్డు భద్రత నియమాలను తెలుసుకొని వాటిని కచ్చితంగా పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని ఆయన తెలిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అనే విషయంపై అవగాహన కల్పించాలని సూచించారు. హెల్మెట్ వినియోగం లేకపోవడం వల్ల జరిగే ప్రమాదాలలో నల్లగొండ జిల్లాలో ప్రతి సంవత్సరం ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు అని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులకు హెల్మెట్ కొనివ్వమని లేఖలు రాయడం ద్వారా కుటుంబ స్థాయిలో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించవచ్చని అన్నారు. అలాగే విద్యార్థులకు రోడ్డు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ వినియోగించడం ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గౌరవించడం స్కూల్‌కు వెళ్లే సమయంలో ఇరుపక్కల చూసుకొని జాగ్రత్తగా దాటడం ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించడం కారులో ప్రయాణించే సమయంలో సీట్‌బెల్ట్ వినియోగించడం, స్కూల్ బస్సులో ఎక్కడం, దిగడం సమయంలో పాటించాల్సిన భద్రతా నియమాలు వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రతపై సందేశం ఇచ్చే విధంగా మోడల్ స్కూల్ ముందు ఉన్న రోడ్డులో హ్యూమన్ చైన్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంపొందించాలనే లక్ష్యాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మల్లికంటి వెంకటేశ్వర్లు , ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది తో పాటు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.



