నల్ల పోచమ్మ జాతరను ఘనంగా నిర్వహించాలి
- నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి
విశ్వంభర,పెద్ద శంకరంపేట: బోరంచ నల్ల పోచమ్మ అమ్మవారి ఏడు వారాల జాతరను వైభవంగా నిర్వహించాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి అన్నారు. మానూర్ మండల పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బోరంచ గ్రామంలో వెలిసిన శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారి 7 వారాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 23 నుండి ప్రారంభం కానున్న ఈ జాతర ఏర్పాట్లపై ఆయన ఆలయ అధికారులు, చైర్మన్, వివిధ శాఖల అధికారులతో కలిసి దేవాలయ ప్రాంగణంలో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా శ్రీ నల్ల పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజహారతి కార్యక్రమాలు చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ , జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎక్కడా త్రాగునీటి ఎద్దడి లేకుండా చూడాలని, చలువ పందళ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. వాహనాల రద్దీ వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయించాలని పోలీసు అధికారులకు సూచించారు. వాహనాలను ఎక్కడ పడితే అక్కడ నిలిపివేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. జాతర జరిగే రోజుల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని,ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగించాలని పారిశుధ్య సిబ్బందిని ఆదేశించారు. ఆలయ క్యూ లైన్లలో భక్తులకు అసౌకర్యం కలగకుండా వాలంటీర్లు, పోలీస్ యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని కోరారు. అలాగే ఈసారి ఎండలు ఎక్కువగా ఉండటంతో భక్తులు పలు జాగ్రత్తలు పాటించాలని అలగే భక్తుల సౌకర్యాల మేరకు వైద్యులు కూడా భక్తులకు అందుబాటులో ఉండి వారికి సేవలందించాలని వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు. భక్తుల రవాణా సౌకర్యం కొరకు ఆర్టీసీ బస్సులను కూడా ఈ జాతర సమయంలో అదనంగా ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు . ఈ సమావేశంలో ఆలయ ఈఓ మహా రుద్రప్ప,ఆలయ కమిటీ చైర్మన్ మల్లయ్య ,గ్రామ సర్పంచ్ బీరప్ప కురుమ,ఉప సర్పంచ్ కలీల్,మండల తహసిల్దార్ విష్ణు సాగర్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు,వైద్య &నర్సింగ్ అధికారు,సంబంధిత శాఖల అధికారులు, రమేష్ చౌహన్, బ్రహ్మానంద రెడ్డి మాజీ సర్పంచ్,సంజీవ్ సర్పంచ్, సంజీవ రెడ్డి,నరసింహ రెడ్డి,స్థానిక ప్రజాప్రతినిధులు, బోరంచ గ్రామ పెద్ద,మరియు నాయకులు పాల్గొన్నారు.



