అభివృద్ధి పనులపై సిఎంసి కమిషనర్ సమీక్ష
విశ్వంభర, శేరిలింగంపల్లి: జోన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు ప్రజా సమస్యల పరిష్కారంపై సిఎంసి కమిషనర్ జి సృజన బుధవారం జోనల్ కార్యాలయం లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే తో పాటు ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, యూబీడీ, యూసీడీ విభాగాల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా, ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులు ‘99 రోజుల ప్రోగ్రాం’లో భాగంగా జూన్ 2, 2026 లోపు పూర్తి చేయాలని కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 190 పనులను ఈ గడువులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.జోన్ పరిధిలోని అన్ని రోడ్లకు ఎండ్-టు-ఎండ్ కార్పెటింగ్ చేపట్టాలని, ఎక్కడా గుంతలు లేకుండా మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు. రోడ్లపై ఉన్న ఆక్రమణలను తక్షణమే తొలగించాలని అధికారులకు ఆదేశించారు.వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని మురుగునీటి కాలువల పూడికతీత పనులను ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలని సూచించారు. అలాగే వీధి దీపాల సమస్యలపై అసిస్టెంట్ ఇంజనీర్లు వెంటనే స్పందించి ప్రజల ఫిర్యాదులను సమయానుకూలంగా పరిష్కరించాలని తెలిపారు. పార్కులు, క్రీడా ప్రాంగణాలు, కమ్యూనిటీ హాళ్లు వంటి ప్రభుత్వ ఆస్తుల పూర్తి వివరాలను సేకరించాలని, ఖాళీ స్థలాలకు 10 రోజుల్లోపు హద్దులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరిశుభ్రత చర్యల భాగంగా చెరువులో గుర్రపు డెక్క తొలగింపు మే చివరి నాటికి పూర్తి చేయాలని, దోమల నివారణకు ప్రతి 10 రోజులకు ఒకసారి ఫాగింగ్ మరియు స్ప్రేయింగ్ నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించాలని సూచించారు.జంక్షన్ల సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకోసం కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత నిధులను వినియోగించుకోవాల ని కమిషనర్ తెలిపారు.విభాగాల మధ్య సమన్వయం తో పని చేస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించిన కమిషనర్, పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రతి వారం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.



