ప్రశ్నించే గొంతుకగా నిలిచిన మురళీమోహన్
విశ్వంభర, బాగ్ లింగంపల్లి : అమరుడు చిక్కు మురళీమోహన్ చేసిన పోరాటాలను స్మరించుకుంటూ హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మిత్రుల సమీక్షా సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంవిఓ ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్ వెంకట్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జనవాణి సంస్థ డైరెక్టర్ ప్రతాప్ జెర్ర మాట్లాడుతూ, మురళీమోహన్ సమాజంలోని అన్యాయాలపై నిరంతరం ప్రశ్నించే గొంతుకగా నిలిచారని పేర్కొన్నారు. బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ఆయన అనేక పోరాటాలు నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. శాంతాసిన్హా సభలో మాట్లాడుతూ, మురళీమోహన్ చేపట్టిన కార్యక్రమాలను సంక్షిప్తంగా వివరించారు. సమాజ మార్పు కోసం ఆయన చేసిన కృషి ఆదర్శప్రాయమని తెలిపారు. సభలో తలారి సత్యం, సర్దార్ లింగం, డాక్టర్ సాయన్న, రవీందర్, కామేశ్వరి, ఉప్పలయ్య, విష్ణు తదితరులు పాల్గొని మురళీమోహన్ సేవలను కొనియాడారు.



