భద్రతపై విద్యార్థులకు అవగాహన

భద్రతపై విద్యార్థులకు అవగాహన

విశ్వంభర, కేసముద్రం: కేసముద్రం మండలం కల్వల మోడల్ స్కూల్‌లో స్కౌట్స్, గైడ్స్ శిక్షణలో భాగంగా నిర్వహించిన ఫీల్డ్ ట్రిప్  (హైక్)  కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సమీప ప్రాంతాలకు పాదయాత్రగా వెళ్లి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించారు. హైక్ ద్వారా విద్యార్థుల్లో సమూహంగా పనిచేయడం, క్రమశిక్షణ పాటించడం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అలాగే ప్రకృతి పరిరక్షణపై చైతన్యం పెంచారు. మార్గమధ్యంలో ప్రథమ చికిత్స (ఫస్ట్ ఎయిడ్), మ్యాప్ రీడింగ్, దిశలు గుర్తించడం, క్యాంపింగ్ పద్ధతులు వంటి విషయాల్లో ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు. అదనంగా ఓపెన్ జిమ్, వరి పొలాలు,తాగునీటి వనరులను పరిశీలించారు. ఈ కార్యక్రమాన్ని స్కౌట్ మాస్టర్స్ యాకయ్య, ఫిజికల్ డైరెక్టర్ లలిత, గైడ్ టీచర్స్ పర్యవేక్షణలో సురక్షితంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ పరిమి నవీన్, ఉపాధ్యాయులు నరసయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు తమ అనుభవాలను పంచుకుని హైక్ ఎంతో ఉపయోగకరమని తెలిపారు. అనంతరం జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. హెల్మెట్ వినియోగం ప్రాణరక్షణకు ఎంత ముఖ్యమో ప్రజలకు తెలియజేస్తూ ఉపాధ్యాయులు సందేశాన్ని చాటి చెప్పారు.

Tags: