రోడ్డు నియమాలపై అవగాహన ర్యాలీ
విశ్వంభర, కేసముద్రం: కేసముద్రం మండల కేంద్రంలోని శ్రీ వివేకవర్థిని హైస్కూల్లో బుధవారం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని, వాటిని నివారించడానికి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు చిన్న వయస్సు నుంచే రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, భవిష్యత్తులో వారు బాధ్యతాయుత పౌరులుగా మారడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. హెల్మెట్ ధరించడం, సీటుబెల్ట్ వినియోగం, వేగ పరిమితులు పాటించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదని వంటి ముఖ్యమైన నియమాలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని సూచించారు. అలాగే, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం ప్రమాదకరమని, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను గౌరవించడం ద్వారా అనేక ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. రోడ్డు మీద నడిచే వారు, వాహనదారులు ఇద్దరూ పరస్పరం జాగ్రత్తగా ఉండాలని, చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



