ముందస్తు చర్యలు తీసుకోవాలి
- కలెక్టర్ ఇలా త్రిపాఠి
విశ్వంభర, నిజామాబాద్ : జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. భీంగల్ మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం బాల్కొండ నియోజకవర్గం పరిధిలోని మండలాల ఎంపీడీఓలు, ఆర్ డబ్ల్యూఎస్ ఏఈలు, ఎంపీఓ లు ఇతర అధికారులతో కలెక్టర్ తాగునీరు సరఫరా తీరుతెన్నులపై సమీక్ష నిర్వహించారు. మండలం వారీగా నీటి సరఫరా పరిస్థితి గురించి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, చేపట్టాల్సి ఉన్న మరమ్మతులు తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. వేసవి సీజన్ ను దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలన జరపాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ నీటి ఎద్దడి రాకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ, అవసరమైన చోట యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశించారు. పనులు చేపట్టడానికి ముందు స్థానిక ప్రజాప్రతినిధులను సంప్రదించాలని సూచించారు. ఆయా గ్రామాల వారీగా నీటి సరఫరా పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని, చేతి పంపులు, బోరు బావులకు అవసరమైన చోట తక్షణమే మరమ్మతులు జరిపించాలని, చేతి పంపులకు ఫ్లషింగ్ చేయించాలని అన్నారు.



