ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతపై ఆగ్రహం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతపై ఆగ్రహం

విశ్వంభర, కోఠి : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతపై ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాదు కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయంలో బి. రవీంద్ర నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ, జ్వరం, బీపీ, షుగర్ వంటి సాధారణ వ్యాధులకు అవసరమైన మందులు కూడా అందుబాటులో లేకపోవడం దారుణమన్నారు. ప్రాథమిక, దీర్ఘకాలిక, అత్యవసర మందుల కొరతతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేకపోవడంతో రోగులు ప్రైవేట్ మెడికల్ షాపుల్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని విమర్శించారు. మందుల కొనుగోలు, సరఫరాలో నిర్వాకం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాథమిక, ప్రాణరక్షక మందులను తక్షణమే ఉచితంగా అందుబాటులో ఉంచాలని, సమస్యపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నేర్లకంటి శ్రీకాంత్, టి. సత్య ప్రసాద్, షేక్ మహమూద్ పాల్గొన్నారు.

Tags: